వ్యవసాయ ఉత్పత్తులకు, ఉపాధి హామీ పనులకు అనుమతి
50% సిబ్బందితో ఐటిసేవలకు గ్రీన్‌సిగ్నల్
లాక్‌డౌన్ మార్గదర్శకాల విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను మే 3 వరకూ పొడిగించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తాజా మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. మే 3 వరకూ అన్ని విమాన సర్వీసులు, రైళ్లు, బస్సులు, మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. అయితే ఈ నెల 20 నుంచి పలు రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపింది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని కేంద్రం ప్రకటించింది. నిత్యావసరాల పంపిణీ మినహా ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు ఉండవని పేర్కొంది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. హాట్ స్పాట్ జోన్లను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించనున్నాయి. ఈ ఏరియాల్లో సాధారణ మినహాయింపులు వర్తించవు. 20 నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, క్రయవిక్రయాలకు, మండీలకు, ఉపాధి హామీ పనులకు అనుమతినిచ్చింది. వైద్య సేవలకు తప్ప మిగిలిన వాటికి సరిహద్దు దాటేందుకు ఏ ఒక్కరికీ అనుమతి ఉండబోదని, అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలకు 20 మందికి మించి పాల్గొనరాదని, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, జిమ్‌లు, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, ఈత కొలనులు, బార్లు మూసివేయాలని పేర్కొంది. విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాల మూసివేత కొనసాగుతుంది. అలాగే మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలపై నిషేధం విధించింది. పాలకు సంబంధించిన వ్యాపారాలు, పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ పరిశ్రమ, టీ, కాఫీ, రబ్బరు సాగును కొనసాగించుకోవచ్చు. అక్వా ఉత్పత్తుల క్రయవిక్రయాలకు, రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్ల కార్యకలాపాలకు, వ్యవసాయ పరికరాలు, విడిభాగాల దుకాణాలు తెరిచేందుకు, వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు ఇచ్చే సంస్థలకు, విత్తనోత్పత్తి సహా ఎరువులు, పురుగుమందుల దుకాణాలకు అనుమతి లభించింది. ఇక బ్యాంకుల కార్యకాలాపాలు యథాతథంగా కొనసాగుతాయి. హైవేల్లో రోడ్ల పక్కన దాబాలు, వాహన మరమ్మతుల దుకాణాలకు అనుమతివ్వడం విశేషం. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తరలించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే, ఈ కామర్స్ సంస్థలు, వాహనాలకు అనుమతిచ్చింది. మరోవైపు, వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలంటే, సంబంధిత జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేసింది. ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్లు, మోటార్ మెకానిక్స్, కార్పెంటర్ల సేవలకు అనుమతి దక్కింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరిగా మార్చింది. భవన నిర్మాణ రంగానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తూనే, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్, కేబుల్ సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పింది. ఐటీ సంస్థలు, ఐటీ సేవలకు 50శాతం సిబ్బందితో నిర్వహణకు అనుమతినివ్వడం విశేషం.
సంక్షిప్తంగా మార్గదర్శకాలు ఇవే!
1.విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, ఆటోలు, ట్యాక్సీలు బంద్
2.రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణాలు బంద్
3.దేశవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు అనుమతి
5.గ్రామీణ ప్రాంతాలు, సెజ్‌లలోని పరిశ్రమల నిర్వహణకు అనుమతి. పరిమితంగా నిర్మాణ రంగ పనులకు అనుమతి
6.నిర్మాణరంగ పనులకు స్థానికంగా ఉన్న కార్మికులనే తీసుకోవాలి. కాఫీ, తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్‌కు అనుమతి
7.పట్టణ పరిధిలోని అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి
8.అన్ని రకాల ఈ-కామర్స్ సర్వీసులకు అనుమతి
9.పబ్లిక్‌లో తప్పకుండా మాస్క్‌లు ధరించాలి. హాట్‌స్పాట్‌లలో నిబంధనలు మరింత కఠినం
10.హాట్‌స్పాట్‌లు ప్రకటించే అధికారం రాష్ట్రాలదే హాట్‌స్పాట్‌లలో జనసంచారం ఉండొద్దు
11.మత ప్రార్థనలు, దైవ కార్యక్రమాలు నిషేధం. సభలు సమావేశాలకు అనుమతి లేదు
12.విద్యాసంస్థలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదు
13.మాల్స్, సినిమా హాళ్లు, పార్క్‌లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేత
14.అన్ని రకాల సభలు, సమావేశాలు, స్పోర్ట్ ఈవెంట్స్‌పై నిషేధం
15.అంత్యక్రియలలో 20 మందికి మించి పాల్గొనవద్దు
16.లిఫ్టులలో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దు
17.కార్యాలయాల్లో ఒకరికొకరు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి
18.10 అంతకన్నా ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడంపై నిషేధం
19.సోషల్ డిస్టెన్స్ అమలుకు వీలుగా ఉద్యోగులు షిప్టులు మారే సమయంలో గంట విరామం
20.ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో శానిటైజర్ తప్పనిసరిగా ఉంచాలి
21.విధులు నిర్వహించే వారికి మెడికల్ ఇన్సూరెన్స్
22.వాహనాలు, కార్మికులు విధులు నిర్వహించే సామాగ్రిని శానిటైజ్ చేయాలి
23.ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ రవాణాపై ఆధారపడకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
24.వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణాలు చేయరాదని, 30 నుంచి 40 శాతం మంది మాత్రమే ప్రయాణించాలని సూచించింది.