కోహ్లీసేనపై ప్రశంసల జల్లు
ముంబయి : భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో ఆ జట్టునే మట్టికరిపించి టెస్టు సిరీస్‌ను గెల్చుకోవడం ద్వారా 72 ఏళ్ల తర్వాత చరిత్రను తిరగరాసింది. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో చారిత్రక సిరీస్ విజయాన్ని నమోదు చేసిన కోహ్లీసేన నిజానికి 3-1 తేడాతో సిరీస్ గెలవాల్సింది. కానీ, చివరిదైన నాలుగో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో 2-1 తేడాతో ఈ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవాలన్న దశాబ్దాల కల నెరవేరడంతో క్రికెట్, సినీ, రాజకీయ ప్రముఖులు కోహ్లీసేనపై ట్విటర్లోనూ, ఇతర సోషల్‌మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలతోపాటు ఎందరో ప్రముఖులు, మాజీ క్రికెటర్లు టీమిండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
* ‘ఆస్ట్రేలియాలో తొటిసారిగా టెస్టు సిరీస్‌ను గెలిచినందుకు కోహ్లీ సేనకు శుభాభినందనలు. టీమిండియా ఆల్రౌండ్ ప్రతిభ మమ్మల్ని గర్వపడేలా చేసింది. దీన్నే అలవరచుకోండి’ -రామ్‌నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి
* ‘ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచి కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది.’ -ఐసిసి
* ‘మరిచిపోలేని ఈ విజయాన్ని అందించిన టీమిండియాకు అభినందనలు. భారత్లోని ప్రతి క్రికెట్ అభిమాని గర్వపడుతున్నాడు. టీమిండియా సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. -వీరేంద్ర సెహ్వాగ్
* ‘టీమిండియా అద్భుతంగా ఆడింది. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నా. భారత బ్యాటింగ్ లైనప్కి వెన్నెముకగా నిలిచిన పుజారాకు అభినందనలు. కీపిటప్. బుమ్రా బౌలింగ్ అద్భుతం’ – హర్భజన్ సింగ్
* ‘తొలిసారిగా ఆసీస్లో సిరీస్ నెగ్గిన టీమిండియాకు అభినందనలు. మీ ప్రదర్శన ఎంతో నచ్చింది’ -మిచెల్ జాన్సన్, ఆసీస్ మాజీ క్రికెటర్
* ‘ఈ చారిత్రక విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది.’ -మహమ్మద్ కైఫ్, మాజీ క్రికెటర్
* ‘కెప్టెన్ కోహ్లీకి అభినందనలు. టీమిండియా బాగా ఆడింది’ – అమిత్ మిశ్రా
* ‘ఇండియన్ క్రికెట్ టీం జిందాబాద్’ -అనుపమ్ ఖేర్, బాలీవుడ్ నటుడు
* ‘బాగా ఆడారు. టీమిండియాకు అభినందనలు’ -శివరాజ్‌సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి