100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చే బాధ్యత నాది
కొడంగల్ నియోజకవర్గం బోమరాస్‌పేట్ రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి
కొడంగల్: కెసిఆర్ ఉద్యోగం పోగొడితే.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలిచ్చే బాధ్యత తాను తీసుకుంటానని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రజాఫ్రంట్ కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బోమరాస్‌పేట్‌లో నిర్వహించిన ఎన్నికల రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. తనదైన శైలిలో తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. నిరుద్యోగులకు కెసిఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. వికారాబాద్ జిల్లాకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు డబుల్ రోడ్డు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. బోమరాస్‌పేట పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేయాలని కోరితే ఎందుకు చేయలేదని నిలదీశారు. తనను ఓడించాలని టిఆర్ఎస్ నేతలు అంటున్నారని, నియోజకవర్గంలో అభివృద్ధి చేసినందుకు నన్ను ఓడించాలా? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల క్రితం కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను తానని, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ నియోజకవర్గం అందరికీ తెలిసిందన్నారు. గల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డిని ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గుర్తించారని చెప్పారు. కెసిఆర్ నల్లత్రాచు లాంటి వారని, నల్లత్రాచును తొక్కి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ 48 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచించారు. ఊర్లోకి కొత్తవాళ్లెవరైనా వస్తే పట్టుకోండని పిలుపునిచ్చారు. కూటమే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తేలినట్లు లగడపాటి చెప్పారని, పది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. రైతులు ఎవరూ బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దని, తాకట్టులో ఉన్న పాసు పుస్తకాలన్నీ రైతుల ఇళ్లకు తానే తీసుకొచ్చి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఉచితంగా అందిస్తామని, 58 ఏళ్లు నిండిన పేదలందరికీ పింఛన్ ఇస్తామని, పేదలకు రేషన్‌లో సన్నబియ్యం, ఇంటికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.