ఘన స్వాగతం పలికిన అభిమానులు
విశాఖ నుంచి ప్రజాపక్షం ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి పర్యటనగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం విశాఖ నగరానికి విచ్చేశారు. ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో కెసిఆర్ కుటుంబ సమేతంగా విశాఖకు చేరుకున్నారు. అక్కడి నుండి పెందుర్తిలోని శ్రీ శారదా పీఠానికి అత్యంత కట్టుదిట్టమైన భారీ భద్రత నడుమ కెసిఆర్ ప్రత్యేక కాన్వాయ్‌లో శారదా పీఠానికి చేరుకున్నారు. పీఠాధిపతి శ్రీస్వరూపానం నంద్ర స్వామి వేదమంత్రాలతో పూర్ణ కుంభంతో కెసిఆర్‌కు సాదరంగా ఆహ్వానించారు. అక్కడి శ్రీ రాజ శ్యామలా దేవి ఆలయంలో కెసిఆర్ చేత స్వరూపానంద స్వామి, ఇతర వేదపండితులు ప్రత్యేక పూజలు చేయించారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఒడిసా రాజధాని భువనేశ్వర్ వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. ఆదివారం రాత్రి అక్కడే బస చేసారు. 24న ఉదయం కోణార్క్ సూర్య దేవాలయం, పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శి స్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. తర్వాత అక్కడి నుంచి కోల్‌కతా వెళ్తారు. 24న సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమావేశమవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీ వెళ్తారు. 25 నుంచి 2,3 రోజుల పాటు కెసిఆర్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.