సీనియర్లకు ‘స్పీకర్’ టెన్షన్
ప్రజాపక్షం/హైదరాబాద్: వివిధ రాష్ట్రాలతో పాటు దేశరాజధానిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ముగిసింది. ఇక అందరి దృష్టి మంత్రివర్గ కూర్పుపై పడింది. జాతీయ రాజకీయాల పేరుతో ఈ నెల 23న హైదరాబాద్ నుంచి బయల్దేరిన సిఎం కెసిఆర్, విశాఖపట్నం, పశ్చిబెంగాల్, ఒడిశా, న్యూఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. కెసిఆర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్న నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ కూర్పు ఎప్పుడు.? ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ప్రస్తుతం టిఆర్‌ఎస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. ఈ నెలాఖరులో లేదా జనవరి 4న మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సిఎం కెసిఆర్‌తో పాటు ఎంఎల్‌సి మహ్మద్ మహమూద్ అలీ ఒకరు మాత్రమే మంత్రిగా ప్రమా ణస్వీకారం చేశారు. మొత్తంగా 18 మందికి అవకాశం ఉన్నప్పటికీ ముందుగా మరో 8 నుంచి 10 మందిని మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తమకు మళ్లీ అవకాశం లభిస్తుందా, లేదా అని తాజా మాజీ మంత్రులు టెన్షన్‌కు గురవుతుంటే, మరోవైపు మంత్రి పదవుల కోసం ఇతర ఎంఎల్‌ఎలు కూడా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అలాగే కొందరు ఎంఎల్‌సిలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదివరకు ఎంఎల్‌సిలుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్‌అలీకి మంత్రివర్గంలో చోటు లభించిన విషయం తెలిసిందే. ఇప్పడు మహమూద్ అలీకి మా త్రమే మంత్రిగా అవకాశం దక్కింది. దీంతో కడియం, నాయిని ఇద్దరూ మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తాజా మాజీ మంత్రులలో తుమ్మల నాగేశ్వర్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. పైగా ఓడిపోయిన వారికి మంత్రిపదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయని సాక్షాత్తు సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. కాగా ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు మాత్రం మరోసారి మంత్రిగా అవకాశం లభించవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రివర్గంలో చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్కసుమన్, ఆలేరు ఎంఎల్‌ఎ గొంగిడి సునీతారెడ్డి, కొడంగల్ ఎంఎల్‌ఎ నరేందర్‌రెడ్డి, వనపర్తి ఎంఎల్‌ఎ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తాజా మాజీ మంత్రుల్లో కొందరినే మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టిఆర్‌ఎస్ సీనియర్ ఎంఎల్‌ఎలకు ‘స్పీకర్’పదవి టెన్షన్ పట్టుకుంది. ఆ పదవి తమకు వద్దంటూ ఇప్పటికే పలువు రు ఎంఎల్‌ఎలు కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మాజీ మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రచారం జరిగినా వారు స్పీకర్ పదవిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. పద్మాదేవేందర్‌రెడ్డిని స్పీకర్ పదవి ఇస్తారా..? లేదా ఆమెను మంత్రివర్గంలో తీసుకుంటా రా..? అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.