అమెరికాలో రోడ్డునపడ్డ 2 కోట్ల మంది ఉద్యోగులు
స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల్లోనూ రికార్డుస్థాయిలో నిరుద్యోగం
కుప్పకూలుతున్న పశ్చిమదేశాల పెట్టుబడిదారీ వ్యవస్థలు, మార్కెట్లు
వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సామాన్య ఉద్యోగిని తీవ్రంగా దెబ్బతీసింది. కరోనా దెబ్బకు కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అమెరికాలో కోటి మంది ఉపాధిపై వేటు పడింది. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌తో ప్రపంచాన్ని శాసించే శానిఫ్రాన్సిస్కో సిలికాన్ వాలీని కరోనా తీవ్రంగా కాటేసింది. ప్రపంచ మార్కెట్ పడిపోవడంతో పలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించడం, లేదా రిట్రెంచ్‌మెంట్ చేయడం వంటి చర్యలకు కంపెనీలు పూనుకుంటున్నాయి. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం కోలుకొని తిరిగి మార్కెట్‌ను సాధించాలంటే కనీసం ఏడాది కాలం పడుతుందని ఆ కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా కారణంగా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లబోతున్నదని, ముఖ్యంగా అసంఘటిత కార్మిక వర్గం రోడ్డున పడబోతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ప్రకటించిన 24 గంటలకే వివిధ దేశాల నుంచి ఉద్యోగాలకు సంబంధించి తాజా నివేదికలు వెలువడుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమల్లో వుండటంతో అమెరికాలో గడిచిన మూడు వారాల్లో దాదాపు రెండు కోట్ల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. రెండు వారాల వ్యవధిలో కోటి మంది తమ ఉద్యోగానంతర బెనిఫిట్స్ కోసం క్లెయిమ్‌లు సమర్పించిన వారం రోజులకే మరో 7 మిలియన్ల మంది (70 లక్షల మంది) యువ ఉద్యోగులు తమ ఉద్యోగానంతర బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ వెల్లడించింది. మరో 30 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారని, అయితే వారంతా దిశానిర్దేశం లేక, లాక్‌డౌన్ ఎత్తివేత కోసం నిరీక్షిస్తున్నారని తెలిపింది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నెట్ కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉద్యోగాల కుదింపు, లేదా ఉద్యోగుల తొలగింపు అనివార్యమని వందలాది కంపెనీలు ప్రకటించాయి. ఇప్పటివరకు ఓవరాల్‌గా అమెరికాలో మూడు వారాల వ్యవధిలో దాదాపు 2 కోట్ల మంది బెనిఫిట్ క్లెయిమ్‌లు చేసుకున్నారని పేర్కొంటూ అమెరికా ప్రభుత్వం నివేదిక సిద్ధం చేస్తోంది. 20 మిలియన్ల మంది ఈస్థాయిలో బెనిఫిట్ క్లెయిమ్‌లు కోరుతారని ఊహించలేదని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఇది ఒక విధంగా అమెరికాకు షాక్ అని పేర్కొన్నారు. వీరుకాకుండా, అమెరికాలో మరో 3 కోట్ల మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడబోతున్నదని ఆ దేశ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 50 రాష్ట్రాలకు గాను 45 రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లుగా భావిస్తున్నారు. ప్రధానంగా కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూయార్క్ రాష్ట్రాలు నిరుద్యోపోటును చవిచూస్తున్నది. తాజా కరోనా ఆర్థిక సంక్షోభానికి కేవలం న్యూహాంప్‌షైర్, నేవాడ, మిన్నిసోటా, రోడేఐలాండ్‌లు మాత్రమే దూరంగా వున్నట్లు చెపుతున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఉపాధి సమస్య చోటు చేసుకుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో 32 శాతం మంది ఉపాధి కోల్పోయారని సెయింట్ లూయిస్ ఫెడ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అటుఇటుగా ఇదే పరిస్థితి నెలకొన్నదని పేర్కొంది.
స్పెయిన్‌లో రికార్డుస్థాయిలో నిరుద్యోగం
కరోనా వైరస్ పుణ్యమా అని స్పెయిన్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ దేశంలో కరోనా కారణంగా 11 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎనలేని ప్రభావం పడింది. కంపెనీల లాక్‌డౌన్ కారణంగా 9 లక్షల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఇది వారం రోజుల క్రితం మాట. ఇప్పుడు ఈ సంఖ్య 12 లక్షలు దాటి వుంటుందని అంచనా. మొత్తంగా ఈ దేశంలో గత రెండు మాసాలుగా 35 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెపుతున్నాయి. 2017 తర్వాత ఈస్థాయిలో నిరుద్యోగం వెంటాడటం ఇదే ప్రథమం. ఎమర్జన్సీ ప్రకటించిన తర్వాత మార్చి 31వ తేదీ నాటికి 8,98,822 మంది ఉపాధి కోల్పోగా, వారిలో 5,50,000 మంది తాత్కాలిక ఉద్యోగులు. గత పది రోజులుగా స్పెయిన్‌లో సగటున రోజుకు 950 కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. భయోత్పాతానికి లోనైన ఆ దేశం పూర్తి లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఉద్యోగులను ఆదుకునేందుకు పటిష్టమైన ప్యాకేజీని ప్రకటించే దిశగా ఆ దేశ ప్రభుత్వం కృషి చేస్తోంది. కార్ల వ్యాపారం, పర్యాటక, నిర్మాణ రంగంలో తాజాగా తాత్కాలిక లేఆఫ్ పొందిన 6,20,000 మంది ఈ గణాంకాల పరిధిలో లేరు. వారిని కూడా కలుపుకుంటే లెక్కలు వేరేలా వుంటాయి.
అట్టుడుకుతున్న ఐరోపా
స్పెయిన్ కాకుండా ఇతర ఐరోపా (యూరప్) దేశాల్లో కేవలం రెండు వారాల వ్యవధిలో 10 లక్షల మంది ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, తక్షణమే వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని యూరోపియన్ ట్రేడ్ యూనియన్ కాన్ఫడరేషన్ (ఇటియుసి) ఇయు నాయకత్వాన్ని కోరింది. వారం రోజుల వ్యవధిలో వందలాది కంపెనీలు మార్కెట్‌లో నాటకీయంగా మాయమవుతున్నాయని, కనీసం కార్మికులకు ఎలాంటి రిలీఫ్ ఇవ్వకుండానే బోర్డులు తిప్పేస్తున్నాయని ఇటియుసి ప్రధాన కార్యదర్శి లూకా విసెంటినీ విమర్శించారు. ఈ యూనియన్‌కు ఐరోపా మొత్తంగా 39 దేశాల్లో 4.5 కోట్ల మంది సభ్యులున్నారు. మరోవైపు ఇయులో కీలకదేశమైన బ్రిటన్‌లో అకస్మాత్తుగా జాబ్ మార్కెట్ కుప్పకూలిందని వైర్డ్ యుకె ఒక కథనం ప్రచురించింది. మూడు వారాల వ్యవధిలో ఈ దేశంలో 4.7 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. గడిచిన 6 వారాల్లో ఉద్యోగ ప్రకటనలే వుండటం లేదు. పోస్టింగ్‌లు 12.5 శాతానికి పడిపోయాయని ఆ వార్తాకథనం పేర్కొంది. కెనడా, మెక్సికో, బ్రెజిల్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లోనూ జాబ్ మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.
భారత్‌లో భిన్నమైన సమస్య
పశ్చిమ దేశాలతో పోల్చితే జాబ్ మార్కెట్‌కు సంబంధించి భారత్ భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నది. మన దేశంలో కరోనా వైరస్ దెబ్బ అత్యధికంగా అసంఘటిత రంగాన్ని ప్రభావితం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏ రంగాన్నయితే పెద్దగా పట్టించుకోదో, అదే రంగం కుప్పకూలింది. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. 130 కోట్ల మంది ప్రజలు చప్పట్లు, దీపాలతో సంఘీభావం తెలియజేయాలని కోరుతున్న మోడీ సర్కారు వాస్తవానికి అందులో 40 కోట్ల మంది ఇంకా ఇంటికి చేరక వలసదారిలో ఉన్నారన్న వాస్తవాన్ని పూర్తిగా విస్మరించింది.