ముంబై: వివాదాస్పద విమర్శలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) ఈ సారి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపై దేశ క్రికెట్ అభిమానులందరూ వేదనతో ఉండగానే కెఆర్‌కె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత జట్టు ఘోరంగా ఓడిపోవడం వెనుక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనేది ఆ ఆరోపణ సారాంశం. సాక్షాత్తూ టీమిండియా కెప్టెన్ కోహ్లీనే మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, అందువల్ల కోహ్లిని జైలుకు పంపాలని అన్నాడు. అంతేకాక అంతర్జాతీయ క్రికెట్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించాలని బీసీసీఐకు సూచించాడు. ” బ్రదర్ కోహ్లీ… నీవు మొదట ఇచ్చిన క్యాచ్‌ను పాకిస్తాన్ ఫీల్డర్లు వదిలేశారు. అయితే తర్వాతి బంతికే సులువైన క్యాచ్ ఇచ్చి అవుటయ్యావు. నువ్వు ఫిక్సింగ్‌కు పాల్పడ్డావని దీనినిబట్టి క్లియర్‌గా అర్థమవుతోంది. 130 కోట్ల మంది భారతీయుల ప్రతిష్టను పాకిస్తాన్‌కు అమ్మేసిన విరాట్ నీపై జీవితకాల నిషేధం విధించాలి. జైలుకు పంపాలి. కోహ్లితో పాటు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని కూడా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. మీరందరూ ఫిక్సర్లు. ప్రజలను మోసం చేశారు.
ఇక ఈ మోసాలు మానుకోవాలి” అని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఆరోపణలు చేసిన కేఆర్‌కేపై ఇటు టీమిండియా, అటు పాకిస్తాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ”ఆటను ఆటలా చూడాలి.. కెఆర్‌కే.. టీమిండియా మేటి జట్లను ఓడించి ఫైనల్ చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోహ్లి నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ అనేది గుర్తుంచుకో.. అనవసర ఆరోపణలు చేయొద్దు..” అని వారు హితవు పలికారు.