భారత్‌లో ఒక్కరోజే 17 మంది మృతి
24 గంటల వ్యవధిలో 540 కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో 6.475కి పెరిగిన కొవిడ్ 19 కేసులు
న్యూఢిల్లీ : కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి అందిన సమాచారం ప్రకారం, భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 6475కి పెరిగింది. ఇందులో 583 మంది డిశ్చార్జి కాగా, 196 మంది మరణించారు. కాగా, 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 549 కేసులు కొత్తగా నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 17 మరణాలు సంభవించాయని తెలిపింది. కొవిడ్ రోగులకు వైద్య అందించే సిబ్బంది కోసం 1.7 కోట్ల వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇలు) ఆర్డర్ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశీయంగా 20 మంది తయారీదారులు వీటిని ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. వీటి సరఫరా కూడా ప్రారంభమైందని తెలిపారు. వీటితోపాటు 49 వేల వెంటిలేటర్లకు కూడా ఆర్డర్ చేశామని తెలిపారు. పిపిఇల విషయంలో రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా కిట్లు సరఫరా చేస్తామన్నారు. కొవిడ్ పోరుకు 3,250 రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చినట్లు తెలిపారు. మొత్తం 5వేల కోచ్‌లను మార్పు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇప్పటివరకు లక్షా 30 వేల శాంపిళ్లను పరీక్షించామని, వీటిలో 5,734 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధికారి వెల్లడించారు. గత నెల, నెలన్నరగా చేపడుతున్న శాంపిళ్లలో 3 నుంచి 5 శాతం మందికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఒక్కరోజే 13,143 శాంపిళ్లను పరీక్షించామని చెప్పారు. ఇదిలావుండగా రానున్నరోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఆ రాష్ట్రంలో 72మంది మృత్యువాతపడగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 1297కి చేరింది. కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, కేసుల సంఖ్య 5865గా, మరణాల సంఖ్య 169గా వుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకే ఒక్క కేసు నమోదైంది. ఇప్పటివరకు 349 కేసులు నమోదుకాగా, నలుగురు మరణించారు. ఢిల్లీలో 669 మందికి కరోనా సోకగా, వారిలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇరవై మంది కోలుకున్నారు. గుజరాత్‌లో 241 కేసులు నమోదుకాగా, 17 మంది మరణించారు. అలాగే హర్యానాలో 154 కేసులు నమోదుకాగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లో 184 కేసులు నమోదుకాగా, నలుగురు మరణించారు. కర్నాటకలో 197మందికి కరోనా సోకగా, వారిలో ఆరుగురు మరణించారు. కేరళలో గురువారం స్వల్పంగా కేసులు పెరిగాయి. మొత్తం కేసుల సంఖ్య 357 కాగా, అక్క డ ఇద్దరు మరణించారు. మరో97 మంది రికవరీ అయ్యారు. మధ్యప్రదేశ్‌లో 389 మందికి కరోనా సోకింది. వారిలో 30 మంది మృతి చెందారు. ఒడిశాలో 44 కేసులు నమోదుకాగా ఒకరు మరణించారు. పంజాబ్‌లో 130 కేసులు నమోదుకాగా, పది మంది మరణించారు. రాజస్థాన్‌లో 430 కేసులు నమోదుకాగా, ఏడుగురు మరణించారు. తమిళనాడులు కేసుల సంఖ్య చాపకింద నీరులా పెరుగుతున్నాయి. తబ్లిగి జమాత్ ఈ రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ రాష్ట్రంలో 834 మందికి కరోనా సోకగా, వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.