లండన్: క్రికెట్ ఫైనల్ మ్యాచ్ అంటే సాధారణంగా మన వారు పడిచస్తారు. అదే మన ఇండియా ఫైనల్ లో ఆడుతుందంటే ఇక చెప్పనవసరం లేదు. ఫైనల్‌లో మనం పాకిస్తాన్‌తో తలపడుతున్నామంటే ఇక మన వారికే కాదు యావత్ భారత ఉపఖండంలోనే.. కాదు కాదు క్రికెట్‌ను అభిమానించే యావత్ దేశాలన్నిటా ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో.. ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఈ కారణాల రీత్యా 18 వ తేదీ ఆదివారం జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా! ఫైనల్ లో ఇండియా, పాకిస్తాన్ లు తలపడుతుండటంతో ఈ హై వోల్టేజ్ ఫైట్ పై ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఉండగా, ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాయి వ్యాపార వర్గాలు కూడా.
ప్రధానంగా ఇండియా పాక్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఆదివారం మ్యాచ్ తో భారీ బిజినెస్‌కు తెరలేపింది. టీవీ యాడ్స్ ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది ఆ సంస్థ. ఫైనల్ మ్యాచ్ లైవ్ లో యాడ్ స్పేస్ ను రికార్డు స్థాయిలో అమ్మేసింది ఈ సంస్థ. ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం.. ఇండియా, పాక్ ఫైనల్ మ్యాచ్ లో పది సెకన్ల యాడ్ ధర ఇరవై లక్షల రుపాయలట. అంటే 10 సెకన్ల యాడ్ ఒక్కసారి వస్తే ఈ ధర. వ్యాపార సంస్థలు, కోట్ల మంది చూసే ఈ మ్యాచ్ లో తమ యాడ్ వస్తే చాలన్నట్లు పోటీ పడుతుండటంతో ఈ డిమాండ్ ను స్టార్ స్పోర్ట్స్ క్యాష్ చేసుకుంటోంది.
కాగా ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోని ఇతర మ్యాచ్ లకు పది సెకన్ల యాడ్ స్పాట్ ధర నాలుగు లక్షల రూపాయల వరకూ నమోదైందని తెలుస్తున్నది. అయితే ఫైనల్ మ్యాచ్ కావడం, అదీనూ ఇండియా పాకిస్తాన్‌ల మధ్య మ్యాచ్ కావడంతో ఈ ధర ఐదు రెట్లు పెరిగి ఇరవై లక్షలకు చేరింది. ఎందుకంటే దాదాపు 250 కోట్ల జనాభా ఉన్న దేశాలు ఈ మ్యాచ్‌ను చూసే అవకాశముంది మరి.