హైదరాబాద్/ప‌్రజాపక్షం : కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ పరిధిలోకి పత్రికరంగాన్ని కూడా చేర్చాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజెయు) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్‌సింగ్ జమ్మూ గురువారంనాడొక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యరంగంలో ఉద్యోగులకు ప్రతి ఒక్కరికి 50 లక్షల రూపాయల ఆరోగ్యబీమాను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇదే లాక్‌డౌన్‌లో నిరంతరాయంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. మీడియాకు ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పత్రికలకు కేంద్ర ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీని విస్తరించాలని డిమాండ్ చేశారు. వార్తా పత్రికల పంపిణీ కష్టసాధ్యంగా మారిందని, లాక్‌డౌన్ కారణంగా పత్రికలను పంపిణీ చేయడానికి ఏజెంట్లు, పేపరుబాయ్స్ తిరస్కరించడం పట్ల ఐజెయు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పత్రికలపై కూడా వైరస్ సజీవంగా వుంటుందని సోషల్‌మీడియాలో వచ్చిన ఒక తప్పుడు సమాచారం కారణంగా పత్రికల పంపిణీకి ఏజెంట్లు, బాయ్స్ తిరస్కరిస్తున్నారని, అలాగే సబ్‌స్క్రయిబర్లు కూడా వీటిని స్వీకరించడానికి నిరాకరిస్తున్నారని, దీంతో పత్రికలు తీవ్ర నష్టాల్లో పడిపోయాయని గుర్తు చేశారు. దీని వల్ల సర్క్యులేషన్, అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఆదాయం పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికలపై కరోనా వైరస్ ఉండటంపై వచ్చిన అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని, ప్రతి వ్యక్తికీ పత్రిక అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో విలేకరులపై పోలీసులు జరుపుతున్న దాడులను అరికట్టాలని శ్రీనివాస్ రెడ్డి, బల్వీందర్ డిమాండ్ చేశారు.
పత్రికలకూ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి : ఐజెయు
RELATED ARTICLES