సునామీ హెచ్చరిక జారీ… ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
మనీలా: ఫిలిప్పీన్స్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిందానావో ద్వీపంలోని జనరల్ శాంటోస్ అనే నగరానికి ఉత్తరాన 193కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తీరాల్లో సునామీ వచ్చే ప్రమాదముందని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరించింది. భూకంపం నేపథ్యంలో అక్కడి అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. హెచ్చరికల తీవ్రతను బట్టి ప్రజలు తీర ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని సూచించారు. ఫిలిప్పీన్స్‌తోపాటు ఇండోనేషియాలోని కొన్ని ద్వీపాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం వల్ల కలిగిన నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు.