మోడీ సర్కారు దౌర్భాగ్య పరిస్థితిపై విరుచుకుపడిన వామపక్షాలు
తప్పుడు విధానాలే ఆర్థిక వ్యవస్థ వినాశనానికి కారణమని విమర్శ
ప్రజాపక్షం/న్యూఢిల్లీ : జిఎస్‌టి ఆదాయం తగ్గుముఖం పట్టడం ‘దైవఘటన’గా కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించడాన్ని వామపక్షాలు తప్పుబట్టాయి. మోడీ సర్కారు చేసిన పరమ తప్పిదాలు, విధాన వైఫల్యం కారణంగా ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, ప్రభుత్వ ఆర్థిక విధానాలు తప్పులతడక అని రుజువైందని విమర్శించాయి. రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్‌టి పరిహారాన్ని ఎగ్గొట్టడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ పాపాన్ని ఇలా దేవుడిపైకి నెట్టేశారని, ఇది మోడీ ప్రభుత్వ దౌర్భాగ్య పరిస్థితిని తెలియజేస్తున్నదని వ్యాఖ్యానించాయి. చివరకు రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపి తన వైఫల్యాన్ని చాటుకున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. జిఎస్‌టి చట్టం చేసినప్పుడే పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీయిచ్చిందని, ఇప్పుడు దాన్ని తుంగలోతొక్కి దైవలీల పేరుతో నాటకాలు ఆడుతున్నదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. జిఎస్‌టి పరిహారం పొందడమనేది రాష్ట్ర ప్రభుత్వాల చట్టబద్ధమైన హక్కు అని పేర్కొన్నారు. కరోనా కారణంగానే జిఎస్‌టి పరిహారాన్ని చెల్లించలేకపోతున్నామని చెప్పడం అనైతికం, పూర్తి తప్పిదమని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనానికి మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యమే ప్రధాన కారణమని, దానికి కరోనా కొంతమేరకు దోహదం చేసిందని గుర్తు చేశారు. కరోనా ప్రబలడానికి ఏడాది ముందే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ చితికిపోవడం, కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెనుభారాన్ని మోస్తున్నాయని, ఇప్పుడు కావాలంటే అప్పులు తెచ్చుకోవాలని నిర్మలా సీతారామన్ ఉచిత సలహాలివ్వడం రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడమేనని రాజా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవడానికి చేసిన దుష్టయత్నం అనైతికం మాత్రమే కాకుండా దేశ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచినట్లయిందని డి.రాజా విమర్శించారు. నిర్మలా సీతారామన్ చేసిన ‘దైవఘటన’ వ్యాఖ్యతో కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో వైరుధ్యాన్ని చూడబోతున్నామని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ట్వీట్ చేశారు. క్రోనీ క్యాపిటలిజం, ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం వల్ల కరోనాకు ముందే ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్థమైందని అన్నారు. ‘కరోనాకు ముందే అలా వుంటే…కరోనా వచ్చాక స్వర్గమేమైనా వుంటుందా?’ అని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఆర్‌బిఐ నుంచి అప్పులు తెచ్చుకోండని రాష్ట్రాలకు చెప్పడం నిర్లక్ష్యపూరిత, నిందార్హమైన చర్యగా ఏచూరి అభివర్ణించారు.