సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ చొరవతో చర్చలకు యూనియన్
వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటలతో చర్చలు సఫలం
సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన యూనియన్ అధ్యక్షులు నర్సింహ
తిరిగి విధుల్లోకి చేరిన నర్సింగ్ స్టాఫ్
ప్రజాపక్షం/హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రి కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ నర్సులు సమ్మె విరమించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి చొరవ తీసుకొని, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌తో ఫోన్‌లో స్టాఫ్ నర్సుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చాడ చొరవతో మంత్రి ఈటల రాజేందర్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద గురువారం నాడు గాంధీ హాస్పటల్ యూనిట్ నర్సింగ్ స్టాఫ్, టి.ఎస్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. మంత్రితో జరిగిన చర్చలు సఫలం కావడంతో స్టాఫ్ నర్సులు సమ్మె విరమిస్తున్నాట్లు ప్రకటించారు. చర్చల్లో యూనియన్ అధ్యక్షులు ఎం.నర్సింహ్మ, కార్యనిర్వహక అధ్యక్షలు బి.మేఘమాల, ప్రధాన కార్యదర్శి జిహెచ్.లక్ష్మి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బి.ఇందిరా పాల్గొన్నారు. మంత్రి ఈటలతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని నర్సింహ తెలిపారు. ఈ సందర్భంగా నర్సింహ, మేఘమాల, లక్ష్మి, ఇందిరాలు మాట్లాడుతూ స్టాఫ్ నర్సులకు తగిన విధంగా న్యాయం చేస్తామని, అత్యవసర సమయంలో సమ్మె విరమించాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని మంత్రి హామినిచ్చారని వెల్లడించారు. మంత్రి ఇచ్చిన హామీ మేర కు తమ యూనియన్ సమ్మె విరమించిందని తెలిపారు. తిరిగి విధుల్లో చేరుతారని ప్రకటించారు. గాంధీ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సులుగా గత 13 సంవత్సరాల నుంచి 2020 మంది పనిచేస్తున్నారని నర్సింహ్మ తెలిపారు. ప్రస్తుతం వారికి రూ.17,500 వేతనం మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఈనెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది నర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా నియమించుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. కొత్తగా చేరేవారికి రూ.2500 వేతనంగా నిర్ణయించారన్నారు. 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు తక్కువ వేతనాలు ఉన్నాయని నర్సింగ్ స్టాఫ్ ఆందోళన చెందుతున్నారని అన్నారు. అలాగే నోటిఫికేషన్‌లో 34 సంవత్సరాల వయస్సు పరిమితిని విధించారని అన్నారు. తమలో చాలామందికి వయస్సు పరిమితి దాటిపోయిందన్నారు. కావునా, గాంధీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.2500 వేతనం ఇవ్వాల్సిందిగా మంత్రి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఇటీవల కోవిడ్-19లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి 10 శాతం ఇన్సెటివ్ ప్రకటించడం జరిగిందన్నారు. దీని ద్వారా తమకు కేవలం రూ.7500 మాత్రమే ప్రోత్సహం అందుతున్నారు. కావునా తమకు నెల వేతనం ప్రోత్సాహకంగా ఇవ్వాలని కోరమని చెప్పారు. 13 సంవత్సరాలుగా గాంధీలో పనిచేస్తున్న తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని వారు మంత్రికి విజ్ఙప్తి చేశామని చెప్పారు. మంత్రితో సానుకుల వాతావరణంలో చర్చలు జరిగాయని, ప్రభుత్వం నుంచి సానుకుల ప్రకటన వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.