బిజెపి ద్వేషం, మతతత్వ పక్షపాత వైరస్‌ను వ్యాపింపజేస్తోంది
12 కోట్ల మంది ఉద్యోగాలు పోయాయ్
ఆ కుటుంబాలకు రూ. 7500 ఇవ్వాలి
సిడబ్ల్యుసి సమావేశంలో సోనియాగాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో కాషాయ పార్టీ ద్వేషం, మతతత్వ పక్షపాత వైరస్‌ను వ్యాపింపజేస్తోందన్నారు. సామాజిక సామరస్యానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం దేశంలో కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించేందుకు గురువారం కాంగ్రెస్ వర్కిం గ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశమైంది. సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ సామాజిక సామరస్యానికి జరుగుతున్న నష్టంపై ప్రతి భారతీయుడు చింతించాలని, ఈ నష్టాన్ని పూడ్చేందుకు తమ పార్టీ శక్తివంచన లేకుండా పనిచేస్తదని ఉద్ఘాటించారు. కరోనా వైరస్ సమస్యను ఐక్యంగా పరిష్కరించాల్సిన సమయంలో బిజెపి ద్వేషము, మతతత్వ పక్షపాత వైరస్‌ను వ్యాపిపంచేయడాన్ని కొనసాగిస్తుందని ఆమె మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సిడబ్ల్యుసి సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించిన తరువాత సిడబ్ల్యుసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కావడం ఇది రెండవసారి. కాగా, సోనియా మాట్లాడుతూ గత మూడు వారాల నుంచి కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడం కలవర పెడుతోందని, పరీక్షలను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ విధించిన తరువాత తాను అనేకసార్లు ప్రధాని మోడీకి లేఖలు రాశానని, అనేక చర్యలు, నిర్మాణాత్మక సహకారంపై సూచనలు చేశానని చెప్పారు. దురదృష్ట వశాత్తు ప్రభుత్వం ఆ సూచనలపై పాక్షికంగా స్పందించిందన్నారు. కరోనా కల్లోలంతో దిక్కుతోచని స్థితిలో పడిన వలస కూలీలకు ఆహార భద్రత కల్పించాలని సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఆ కుటుంబాలకు 7500 రూపాయలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పనిచేసే వారు పని దొరకక ఇబ్బంది పడుతున్నారని.. ఈ పరిశ్రమలు తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఇక కరోనా కట్టడిలో అతి ముఖ్య అంశమైన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్న కాంగ్రెస్ పార్టీ సూచనను కేంద్రం పట్టించుకోవడం లేదని సోనియా విమర్శించారు. దేశంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కిట్లు నాసికరంగా ఉండటంతో కచ్చితమైన ఫలితాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ టెస్టు కిట్ల కొరత ఉందని పేర్కొన్నారు. అదే విధంగా లాక్‌డౌన్ కారణంగా ముఖ్యంగా రైతులు, కార్మికులు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉపాధి లేక, సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో నడి రోడ్లపై నిలబడి ఉన్నారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఆహార భద్రత, ఆర్థిక పరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో వ్యాపారం, వాణిజ్యం , పారిశ్రామిక రంగాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని.. సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కరోనాపై విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలి: మన్మోహన్
అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ.. కొవిడ్ 19ను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యంపైనే లాక్‌డౌన్ విజయవంతంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. కొవిడ్ 19ను మనం ఏ పద్ధతిలో పరిష్కరిస్తున్నామన్న దానిపై కూడా విజయం ఆధారపడి ఉంటుందని అన్నారు. “ఈ పోరాటంలో మనం అనేక సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ఎన్ని వనరులు లభిస్తున్నాయన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. చివరకు విజయం అనేది మన సామర్థ్యం పైనే ఆధారపడి ఉంటుంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం చాలా ముఖ్యం” అని మన్మోహన్ సూచించారు.
తొలి ప్రాధాన్య అంశంగా కార్మికుల సమస్య : రాహుల్
కరోనా వేళ కష్టాలు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సమస్యను ప్రభుత్వం తొలి ప్రాధాన్య అంశంగా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను కేవలం హాట్‌స్పాట్ కేంద్రాలకే పరిమితం చేయాలని, గ్రీన్ జోన్లలో ఎత్తివేయాలని సూచించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ తాత్కాలిక ఉపసంహరణ చర్యగా (పాజ్ బటన్ లాంటిది) అని రాహుల్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల గురించి ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మే 3 తర్వాత హాట్‌స్పాట్ కేంద్రాల్లో మాత్రమే లాక్‌డౌన్‌ను పొడిగించాలన్నారు. గ్రీన్‌జోన్లలో కార్యకలాపాలను పునరుద్ధరించాలని రాహుల్ కోరారు.
స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతించండి: ప్రియాంక
లాక్‌డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు వారివారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అంతకంటే ముందు కార్మికులకు తగిన పరీక్షలు నిర్వహించి, జాగ్రత్తలు చెప్పాలన్నారు. కరోనాపై పోరాటంలో శత్రుత్వం కాదు.. దయ, జాలి కీలకపాత్ర పోషిస్తాయని ప్రియాంక అన్నారు.
భవిష్యత్‌పై రోడ్‌మ్యాప్
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం వ్యాప్తంగా విధించిన లాకౌడౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్ ముగిసేందుకు మరో రోజులు గడువు ఉండడంతో ఈ సమయాన్ని భవిష్యత్ కోసం సమగ్ర కార్యాచరణ, వివరణాత్మకమైన నిష్క్రమణ వ్యూహాన్ని రూపొందించి, ప్రచురించేందుకు వెచ్చించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సూచించింది. కొవిడ్ వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కరించుకునేందుకు రాష్ట్రాలకు అధికారం ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ప్రతిపాదించిన తీర్మానాన్ని సిడబ్ల్యుసి ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం అనంతరం ఎఐసిసి ప్రధాని కార్యదర్శి కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ యావత్ భారత్ కరోనా వైరస్‌తో పోరాటం చేస్తుందని బిజెపి మాత్రం మత విభేదాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని సిడబ్ల్యుసి ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. కరోనా వైరస్ కులం, మతం, ప్రాంతం, లింగం ఆధారంగా వివక్ష చూపదని, ఈ సంక్షోభ సమయంలో కొన్ని శక్తుల పట్ల జాత్త్రగా ఉండాలని ఆ తీర్మానంలో సిడబ్ల్యుసి పేరొంది. మొత్తం వడ్డీ రద్దుతో పాటు సంవత్సర కాలం పూర్తిగా వ్యవసాయ, ఇతర రుణాలపై మారిటోరియం విధించాలని సిడబ్ల్యుసి దృఢంగా సిఫార్సు చేసినట్లు వేణుగోపాల్ చెప్పారు.