ప్రజాపక్షం/హైదరాబాద్ : రాష్ట్రంలో గత పదేళ్ళుగా లక్షలాది మంది అర్హులైన నిరుపేదలకు తెల్లరేషన్ కార్డులే ఇవ్వలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం, ఆర్థిక సహాయాన్ని లక్షలాది మంది అర్హులైన నిరుపేదలందరికీ ఇవ్వాలని నేడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క తెల్లరేషన్ కార్డయినా ఇచ్చిన దాఖలాలు లేవని, అయితే ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం లబ్ధిదారుల పేర్లు జిల్లాల కలెక్టర్ల వద్ద ఉన్నాయని, వీరు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆన్లైన్లో, సొంతంగా దరఖాస్తు చేసుకొని వున్నారని, వీరెవ్వరికీ రేషన్‌కార్డులు ఇవ్వలేదని చాడ గుర్తు చేశారు. అందుకే వీరంతా ఉచిత బియ్యం, ఆర్థిక సాయానికి అర్హులేనని పేర్కొన్నారు. అలాగే నగరాల నుంచి గ్రామాలకు చేరుకున్న కూలీలందరికీ అక్కడే రేషన్ ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నారని, వారికి కూడా కరోనా నేపథ్యంలో అందజేసే సాయాన్ని వర్తింపజేయాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి రాసిన ఒక లేఖలో డిమాండ్ చేశారు.
అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ ఇవ్వాలి : సిపిఐ
RELATED ARTICLES