మోడీ సర్కారు విధానంపై సిపిఐ ఆగ్రహం
న్యూఢిల్లీ : హైడ్రోక్లోరోక్విన్ మందుల సరఫరాలో అమెరికా బెదిరింపులకు, ఒత్తిళ్లకు మోడీ ప్రభుత్వం తలొగ్గడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం బుధవారంనాడొక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురహంకారపూరిత వైఖరి ప్రదర్శించడాన్ని ఖండిస్తూ, మోడీ సర్కారు అందుకు తలొగ్గడం అవమానకరమని పేర్కొంది. ఏ వర్ధమాన దేశమూ అమెరికాకు మిత్రదేశంగా లేదని, అలాంటప్పుడు అమెరికా ప్రవర్తనలో ఆశ్చర్యమేమీ వుండదని వ్యాఖ్యానించింది. ప్రపంచం యావత్తూ కొవిడ్ 19తో పోరాడుతూ క్లిష్టదశలో వుందని, అమెరికా ప్రభుత్వం పరస్పర సహకారాన్ని ఏనాడూ విశ్వసించబోదని, తన బెదిరింపులతో తాజాగా అమెరికా వైఖరి మరోసారి బయటపడిందని పేర్కొంది. అమెరికాకు హైడ్రోక్లోరోక్విన్ సరఫరా చేయకపోతే, దాని విధానం బయటపడేదని, కానీ మోడీ ప్రభుత్వం ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గడం సిగ్గుచేటు అని సిపిఐ వ్యాఖ్యానించింది. దేశాల సంక్షేమం, వాటి మధ్య పరస్పర సహకారం వుండాలన్నది తమ పార్టీ విధానమని, మోడీ ప్రభుత్వం ఏ దేశానికైనా మందులను, పిపిఇ పరికరాలను సరఫరా చేయవచ్చని, కాకపోతే అది మన దేశీయ అవసరాలు తీరినప్పుడే జరగాలని అభిప్రాయపడింది. అమెరికాకు భారత్ ఒక జూనియర్ భాగస్వామిగా దేశ విలువను మోడీ ప్రభుత్వం దిగజార్చిందని, భారత్‌ను, భారతీయ పౌరులను అవమానపరిచిన అమెరికాకు అంతధైర్యం కల్పించడం మన విదేశాంగ విధానలోపమేనని తెలిపింది. భారతీయుల హుందాను తగ్గించే ఎలాంటి ప్రయత్నాలను భారతీయులు సహించబోరని సిపిఐ హెచ్చరించింది.