హైదరాబాద్: దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరముందని టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాంగ్రెస్, బిజెపి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని.. ఆ రెండు పార్టీలూ దొందూ దొందేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని ప్రభుత్వాల ఫ్యూడల్ వైఖరి నశించనంత వరకూ దేశంలో సమూల మార్పులు రావని.. అలా జరగాలంటే ధైర్యం, సాహసం అవసరమన్నారు. ఆ సాహసాన్ని తాను చేస్తున్నాని.. ఈ విషయంలో తప్పకుండా విజయం సాధిస్తానని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం నాడు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. టిఆర్ఎస్ తరఫున కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులంతా కెసిఆర్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం కెసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తనను ఎన్నుకున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల సంఘం గెజిట్ జారీ చేయాల్సి ఉందని, ఆ తర్వాతే నూతన ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు. గురువారం నాడే తాను ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని.. అయితే అది ఇంకా ఖరారు కాలేదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇళ్ల స్థలాల అంశాన్ని వీలైనంత తొందరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ వివరించారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసే రోజు తనతో పాటు కొంతమంది మంత్రులు, ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలో మరికొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. వందకు వందశాతం మేనిఫెస్టో అమలు చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే చేసిందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదని, కానీ అమలు చేశామని తెలిపారు. కొద్దిపాటి భూమి ఉన్న రైతు చనిపోయినా రైతుబీమా వర్తింపజేస్తున్నామన్నారు.
దేశానికి కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు అవసరం
RELATED ARTICLES