మూడున్నర లక్షలకు చేరువలో అమెరికా కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా 12.5 లక్షలకు చేరిన కరోనా బాధితుల సంఖ్య
67,000 దాటిన కొవిడ్19 మృతులు
వాషింగ్టన్ ; కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అల్లాడిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా ఆ దేశాన్ని కరోనా తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తోంది. ఏం చేయాలో పాలుపోక చివరకు హైడ్రోక్లోరోక్విన్ మందులను సరఫరా చేయాలని భారత్‌ను కోరాల్సి వచ్చింది. శనివారంనాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12.5 లక్షలకు చేరింది. కేవలం 24 గంటల వ్యవధిలో విదేశాల్లో కరోనా బాధితుల సంఖ్య లక్షకు పైగా నమోదు కావడం గమనార్హం. అలాగే కొవిడ్ 19 మరణాల సంఖ్య 67,000 దాటింది. అమెరికాలో మరీ దారుణంగా కేవలం ఒకేరోజులో కొత్తగా 10,000 కేసులు నమోదయ్యాయి. కడపటి వార్తలు అందేసరికి 190 దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 12,35,732కు చేరింది. రాత్రి 9 గంటల సమయానికి అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 3,21,339కి చేరగా, మరణాల సంఖ్య 9,129కి చేరింది. స్పెయిన్‌లో ఇంకా చెలరేగుతోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 1,30,759 మందికి కరోనా సోకగా, 12,418 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 4 వేల మందికి ఈ వ్యాధి సోకింది. అన్ని దేశాల కన్నా ఇటలీలోనే ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఆ దేశంలో ఇప్పటివరకు 1,24,632 మందికి కరోనా సోకగా, వారిలో 15,362 మంది మరణించారు. అయితే ఇక్కడ కొత్తగా కేసులు నమోదైనట్లు డేటా అందలేదు. జర్మనీలో 99,351 కేసులు నమోదు కాగా, 1,479 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో మరణాల సంఖ్య 7,560కి చేరింది. ఫ్రాన్స్‌లో ఒకే రోజు 900 మందికి పైగా మరణించారు. తాజా వివరాలు ఇంకా అందాల్సివుంది. చైనాలో సాధారణ జన జీవనం కొనసాగుతోంది. బ్రిటన్‌లో మరణాల సంఖ్య 4,934కి చేరింది. టర్కీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రియా, పోర్చుగల్, బ్రెజిల్, ఇజ్రాయిల్, స్వీడన్, దక్షిణ కొరియాలలో కరోనా కేసులు ఓ మాదిరిగా నమోదవుతున్నాయి.