న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఆదివారం సాయంత్రానికి కరోనా సోకిన వారి సంఖ్య 987కి చేరింది. వీరిలో 25 మంది మరణించారు. ఇప్పటివరకు 87 మంది రికవరీ అయ్యారు. దేశంలో యాక్టివ్ కేసులు 875గా వున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్, గుజరాత్ లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మృతుల సంఖ్య జమ్ముకశ్మీర్ లో రెండుకు, గుజరాత్ లో ఐదుకు పెరిగింది. అలాగే మహారాష్ట్రలో కొత్తగా మరో 12 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 193కు పెరిగింది. మధ్యప్రదేశ్ లోనూ కొత్తగా ఐదుగురికి వైరస్ సోకినట్లు నిర్ధారించడంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 39కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 86 మంది కోలుకున్నారు. ఇదిలావుండగా, ఇరాన్ లో ఉన్న 275 మంది భారతీయులు ఆదివారం ఉదయం జోధ్ పూర్ కు చేరుకున్నారు. వీరికి స్క్రీనింగ్ నిర్వహించిన వెంటనే స్థానిక ఆర్మీ స్థావరంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. గతంలోనూ ఇరాన్ లో చిక్కుకున్న దాదాపు 550 మందిని ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో భారత్ కు తీసుకొచ్చారు. మరోవైపు, దేశంలోని అన్ని అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘాను పటిష్టం చేశారు. ఏ ఒక్కరినీ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పంపించవద్దని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రాలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.
దేశంలో 1000కి చేరువగా కరోనా కేసులు
RELATED ARTICLES