పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్: రెక్కాడితే గాని డొక్కాడని శ్రమజీవులు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక నిత్యావసర సరుకులు కొనలేని దుస్థితిలో ఉన్నారని, అలాంటి వారిని గుర్తించి సహాయం చేసి ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ తిలక్‌నగర్ చౌరస్తా లో తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన దాదాపు 200 మంది ఆటోడ్రైవర్లకు ఉచితంగా బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను చాడ వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహాయక చర్యలో భాగంగా ప్రభుత్వం రేషన్, రూ.1500లతో పాటు రూ.5000 భృతి రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో పేదలు, కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం ప్రకటనలకే పరిమితం అయిందని విమర్శించారు. కరోనా భూతాన్ని తరిమేందుకు ప్రజలు ఇళ్లల్లో ఉండి ఎంతో సహకరిస్తూ కష్టకాలంలో ఉన్న వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు, రేషన్ సరుకులు ప్రతి ఇంటికి అందజేయాలన్నారు. తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లందరికీ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో రోజు యూనియన్ తరఫున ఉచితంగా బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామన్నారు. చాలా మంది ఆటోడ్రైవర్లకు తెల్ల రేషన్‌కార్డులు లేవని, వారికి ప్రత్యేక భృతిని ప్రభుత్వం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.రాకేష్‌సింగ్, ఎఐటియుసి నాయకులు బి.కిషన్, రవీందర్‌రెడ్డి, భూపాల్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
వలస కార్మికులను ఆదుకోడానికి
10 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలె
కేంద్ర ప్రభుత్వానికి సిపిఐ డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్: దేశవ్యాప్తంగా తిండి లేక ఇబ్బందిపడుతున్న వలస కార్మికులను ఆదుకోడానికి రూ.10 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ ప్రకటించి ఇప్పటికే 24 రోజులు గడిచాయని, ఇప్పుడు లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించారని ఆయన తెలిపారు. లాక్‌డౌన్ పొడిగించిన తర్వాత కేంద్రం 20 అంశాలకు సంబంధించిన సూచనలు చేసిందని, అయితే వాటిలో వలస కార్మికులు, చేతివృత్తుల వారు, దినసరి కూలీలను విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ఆదేశాలు లేకపోవడం బాధాకరమన్నారు. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులు తిండి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోడానికి సహాయ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీల కు ప్రతి కుటుంబానికి రూ.5000 ఇచ్చి ఆదుకోవాలన్నా రు. ఆటోడ్రైవర్స్, హమాలీ కార్మికులను గుర్తించి ప్యాకేజీని అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజు వారీ కూలీలకు గ్రామీణ ఉపాధి పథకం కింద ఉపాధి కల్పించి, వారికి వెంటనే బిల్లు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. చేనేత, పంచవృత్తులు, చాకలి, మం గలి పేద కుటుంబాలకు పనులు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారని, వారికి రూ.5 వేలు చెల్లించి నిత్యావసర వస్తువులు అందజేసి ఆదుకోవాలన్నారు. జన్‌ధన్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల పాటు నెలకు రూ.500 చెల్లించే విషయంలో చాలా మంది లబ్ధిదారులు జన్‌ధన్ ఖాతాలను సాధారణ ఖాతాలుగా మార్చుకోవడం జరిగిందని, వారికి డబ్బులు జమ కావడం లేదని తెలిపారు. అందరికీ డబ్బులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చాడ కోరారు. సిపిఐ పేదలకు ఉచితంగా కూరగాయలు, బియ్యం శక్తికొద్ది పంపిణీ చేస్తోందని తెలిపారు.