🔸కరోనాకు నివారణతప్ప మరో మార్గం లేదు
🔸సామాజిక దూరం పాటించాలి
🔸ఈ కష్ట సమయంలో పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలి
🔸స్వీయ నియంత్రణ అందరూ పాటించాలి
🔸మధిరలో పర్యటనలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కమల్లు
మధిర, మార్చి 27: కరోనా వచ్చిన విపత్కర పరిస్థితుల్లో యావత్ తెలంగాణ సమాజం మొత్తం అందరూ లాక్ డౌన్ కు, ప్రభుత్వానికి సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ఈ విపత్తును మనం ఇంటికే పరిమితం అయి ఎదుర్కోవాలన్నారు.
కరోనాను ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), దేశంలోని ఆరోగ్య సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలను తూ.చ తప్పకుండా పాటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాను నివారణ చేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థుతుల్లో అందరూ మాట మీదకు వచ్చి సమాజాన్ని కాపాడుకోవాలని అన్నారు. కరోనాను నియంత్రించే క్రమంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చేసుకోవాలని అన్నారు. ప్రపంచమంతా వణికిపోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మన దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను, కుటుంబాలను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా కఠినమైన నియమాలను పాటించాలని స్పష్టం చేశారు. తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిందే, స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిందే, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, అలాగే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లి వస్తే ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని భట్టి చెప్పారు. లాక్ డౌన్ చేసిన ఈ పరిస్థితుల్లో నిత్యావసర సరుకులను ఒకే చోట కాకుండా సాధ్‌మైన మేరకు డివిజన్ల వారీగా, అదీకాకుంటే బ్లాకుల వారీగానే అమ్మకాలను జరిపించాలని అన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా అమ్మకాలు జరిపించాలని ప్రభుత్వానికి సీఎల్పీ నేత భట్టి సూచించారు. కిరాణ దుకాణాలకు కూడా డివిజన్స్ ఏర్పాటు చేసి అమ్మకాలకు తగిన తమయం కేటాయిస్తే సామాజిక దూరం పాటించినట్లు అవుతుందన్నారు. లాక్ డౌన్ ప్రధానంగా మనం ఎదుర్కొనే ప్రధానమైన మరో సమస్య రైతులు. ఇప్పటికే ప్రధాన పంటలు అన్నీ కోతకు సిద్ధమవయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలోని కూలీలను గుర్తించి వారికి పంటను కోసేందుకు అనుమతులు ఇచ్చి.. ఆ పంటను అమ్మడానికి, ప్రభుత్వ పరంగా కొనడానికి, లేకపోతే నిలువ ఉంచేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని భట్టి సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక కార్యాచరణతో కూడాని ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఖమ్మం ప్రాంతంలో మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంటలు కోతకు వచ్చాయి. లాక్ డౌన్ నేపథ్యంలో కూలీలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వీటికి సంబంధించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి రైతులకు ధైర్యం ఇవ్వాలని భట్టి చెప్పారు.
రోజువారీ కూలీలకు, నిరుపేదలకు, దిక్కులేనివారికి ఈ లాక్ డౌన్ సందర్భంగా అవసరం అయితే రెండుమూడునెలలకు సరిపడే రేషన్ ను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వానికి సీఎల్పీ నేత భట్టి సూచించారు. ఈ రేషన్ కూడా బయో మెట్రిక్ తో కాకుండా ఇంటింటికీ పంపించి అందించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో అత్యంత అవసరమైన మాస్కులు, శానిటైజర్స్ ను ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసి అందించాలని ప్రభుత్వానికి భట్టి సూచించారు. వీటిని గ్రామస్థాయిలోకి కూడా చేరేట్టు చేయాలని చెప్పారు.
లాక్ డౌన్ నియమావళిని ప్రజలు పాటించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, వారికి ఎటువంటి ఇబ్బందులు అయినా తీర్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని భట్టి సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన తెలిపారు. ఇది మనందరి బాధ్యత అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. మనందరికోసం ఇంత కష్ట సమయంలో పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ, ఇతర అధికారులకు మనందరం పార్టీలకతీతంగా సహకరించాలని సీఎల్పీ నేత పిలుపునిచ్చారు.
ప్రభుత్వం కూడా తప్పనిసరగా ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని, వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించాలని భట్టి చెప్పారు. ప్రభుత్వం ఏరోజుకారోజు ఈ పరిస్థితిపై రివ్యూ చేసుకుని అవసరం అయితే ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల అవసరాలు కనుక్కుని ముందుకు వెళ్లాలని చెప్పారు. మనందరం లాక్ డౌన్ సూచనలు పాటిస్తే తెలంగాణను కరోనా మహమ్మారినుంచి కాపాడగలమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు.