గువహటి: అస్సాంలో కల్తీమద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య 300 దాటింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారికి రూ. 50,000 ప్రకటించింది. దీనిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ…‘ఇది భయానక ఘటన. ఇందుకు కారకులైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టం. దీనిపై విచారణకు కూడా ఆదేశించాం. రూ.10, రూ.20లకు ఒక్కో గ్లాసు మద్యం విక్రయించడంతో కొందరు పరిమితికి మించి తీసుకున్నారు. ఈ కారణం వల్లే మృతుల సంఖ్య పెరిగింది’ అని తెలిపారు.
అస్సాంలోని సల్మారా టీ తోటల్లో పనిచేసే కూలీలు గత గురువారం మద్యాన్ని సేవించారు. అయితే, అది కల్తీ మద్యం కావడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మొదట 39 మందితో మొదలైన మరణమృదంగం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 140 మంది ఉసురుతీసింది. మరికొందరి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు గత గురువారమే కాకుండా.. అంతకు ముందు ఆ ప్రాంతంలో మద్యం తాగిన వారు కూడా ఇప్పుడు ఆస్పత్రుల బాట పడుతున్నారు. తాము తాగింది కూడా కల్తీ మద్యమేనన్న భయంతో వారు ఆస్పత్రికి పరుగులు పెడుతున్నారు.
అస్సాంలో 140కి కల్తీ మద్యం మృతులు
RELATED ARTICLES