HomeNewsLatest Newsరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  శ్వేతపత్రం : అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  శ్వేతపత్రం : అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌

వైద్యసేవలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని సిఎం కెసిఆర్‌ మాటలను బట్టి తెలుస్తోందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి.. కొవిడ్‌  బాధితులకు చేస్తున్న  వైద్య సేవలు, లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలపై అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆయా పార్టీలిచ్చే అభిప్రాయాలు తీసుకోవాలని కోరాయి. హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్‌ హాల్‌లో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, కాంగ్రెస్‌ రాజ్యసభ మాజీ సభ్యులు విహెచ్‌ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి:  కోదండరామ్‌
సుదీర్ఘకాల లాక్‌డౌన్‌తో రాష్టంలో ఆర్థిక రంగం కుదేలయింది. పేద, మధ్యతరగతి వారికి రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా మానవత్వంతో ప్రతి కుటుంబానికి రేషన్‌ బియ్యం, కందిపప్పు సహా రాబోయే రెండు నెలలకి రూ. 5 వేలు ఇవ్వాలి. అద్దెకు ఉన్న పేదవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల కిరాయిల చెల్లింపుపై వాయిదా వేస్తూ ప్రభుత్వం ఒక ఆర్డర్‌ (ఉత్తర్వులు) జారీ చేయాలి. శ్రీకాకుళం వంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వలస కూలీలను తమ సొంత గూటికి చేర్చేందుకు ప్రభుత్వమే అవకాశాలు కల్పించాలి. రాష్ట్రంలో సెక్యూరిటీ బాండ్లు విక్రయించడం ద్వారా రూ.3500 కోట్ల రూపాయలు సేకరించారా? బాండ్లు అమ్మి తే వచ్చిన డబ్బులు ఏమయ్యాయి? తక్షణమే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక  శ్వేత పత్రం విడుదల చేయా లి. సిఎం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరిగిన చాలా సందర్భాల్లో విలేకరులపైనా, పత్రికలపైనా సిఎం విరుచుకుపడడడాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండిస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులందరికీ పూర్తి జీతం ఇవ్వాలి. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ మాజీ ఎంపి వి.హనుమంతరావుపై పెట్టిన కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలి. బాధిత ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుండి శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందికి, పోలీసులకూ అఖిలపక్షపార్టీలు అభినందనలు. కరోనా పీడితుడు మృతి చెందితే డాక్టర్లపై దాడులు చేయకుండా చూడాలి. అన్ని జిల్లాల్లోని ఏరియా ఆస్పత్రులను అభివృద్ధి చేయడంతో పాటు 104, 108  అంబులెన్స్‌లు పునరుద్ధరించాలి.
వలస కార్మికులకు ఎన్ని శిబిరాలు పెట్టారు? : చాడ
లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన అంశాలను చర్చించేందుకు అఖిలపక్షం ఏర్పాటుకు సిపిఐగా తాము లేఖ రాసినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు ఇచ్చే నిర్మాణాత్మక సూచనలు తెలుసుకునేందుకు, ఇప్పటికైనా ప్రజా సంక్షేమం రీత్యా  రాష్ట్రంలో తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని  కోరుతున్నాం. అన్ని పార్టీలను కలుపుకొని పోతే వచ్చే నష్టం ఏమిటి? మార్చి 22 నుండి ఏప్రిల్‌ 14 వరకు మూడు వారాల లాక్‌డౌన్‌లో ప్రజలు  పూర్తిగా ఇంటికే పరిమితం  కావడంతో కోట్లాది మందికి ఉపాధి పోయింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న వారికి కుటుంబానికి ఇస్తానన్న రూ. 1500 ఇంకా అందలేదు. మనిషికి 12 కిలోల బియ్యం ఇస్తామన్నారు. అవి కూడా 60 శాతం మందికే అందాయి. వలసకార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్ని సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారో సమాచారం లేదు. వలస కార్మికులకు కూడా రూ. 5వేలు బియ్యం ఇవ్వాలి.  కాంగ్రెస్‌ మాజీ ఎంపి వి.హనుమంతరావుపై కేసు పెట్టడం దారుణం. వెంటనే ఆ కేసును ఉపసంహరించుకోవాలి. కరోనా నివారణలో అఖిలపక్షంగా అందరం కలిసి వెళ్దాం.
కరోనా టెస్టులు రోజుకు వెయ్యి మందికేనా? : ఉత్తమ్‌
కరోనా వల్ల రెండవ ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు వెయ్యి మందికి మాత్రమే కరోనా టెస్టు చేస్తే ఎలా? ఐసిఎంఆర్‌ ఆమోదిత సంస్థలలో ఎందుకు టెస్ట్‌ చేయడం లేదు? ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపిన ప్రతిపక్ష పార్టీల వార్తలు మీడియాలో రాయండి. ఈ సమయంలో మీడియా సెల్ఫ్‌ రీస్ట్రిక్ట్‌ పెట్టుకోవడం మంచిది కాదు. లాక్‌డౌన్‌ సందర్భంలో 22న ప్రకటించిన ప్రభుత్వ సాయం ఇప్పటికీ అందించలేదు. వలస కూలీల విషయంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోంది. 12కిలోల బియ్యం, ఆర్థిక సాయం అందరికీ ఇవ్వాలి. రైతులకు ఇస్తామన్న గన్నీబ్యాగ్‌లు, బస్తాలు మార్కెట్‌లో అందుబాటులో లేవు, పసుపు, బత్తాయి, మిర్చి, మామిడి, కందులు తక్షణమే  కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా స్పందించాలి.
వృత్తిదారులను ఆదుకోవాలి : ఎల్‌. రమణ  
ఊహించని రీతిలో ప్రపంచం కరోనాకు గురయింది. వైరస్‌ వల్ల పేద వర్గాలు… కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేనేత, కల్లుగీత కార్మికులు, ఇతర చేతి త్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం విడుదల చేయాలి.
బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గాయి : చెరుకు సుధాకర్‌
సుదీర్ఘకాలం లాక్‌డౌన్‌తో బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలు బాగా తగ్గి పోయాయని, ఇలాంటి సమయంలో రోగులకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ 21 రోజుల్లో లాక్‌డౌన్‌ పరిస్థితి చక్కబడకపోతే ఇక దేశం కోలుకోవడం కష్టమే. కరోనా రోగుల కోసం గాంధీ ఆస్పత్రితో పాటు మిగతా హాస్పిటళ్లను కూడా వినియోగించుకోవాలి. వలస కార్మికులను వారి సొంత ఊళ్లకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలి. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొంటూ అవసరమైన వారికి వెసులుబాటు కల్పించాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments