సమావేశానికి పిలుపునిచ్చిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్ర సంస్థకు తగిన బుద్ధి చెప్పడానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. శనివారం ఈ సమావేశం జరగనుంది. గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారు 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అనేక మంది గాయాలపాలయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం మొదటిసారి ఇలాంటి సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ హేయమైన దాడిపై అన్ని పక్షాలు ఒకే రకమైన అభిప్రాయంతో ముందుకెళ్లాలన్నదే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. గతంలో పఠాన్ కోట, ఉరీ, నగ్రోటా మీద ఉగ్రదాడులు జరిగిన సందర్భాలున్నప్పటికీ.. తదుపరి చర్యల కోసం మొదటిసారి విపక్షాలతో చర్చించనుంది. 2016లో కేంద్రం ఇలాంటి సమావేశాన్నే నిర్వహించింది. అయితే అప్పుడు మెరుపు దాడులు నిర్వహించిన తర్వాత దానికి గురించి వివరించడానికి మాత్రమే దాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు మిగతాపక్షాల అభిప్రాయాన్ని సేకరించలేదు. అయితే దాడి అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేశారు.