ఖాట్మండూ: నేపాల్‌లోని నువాకోట్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు అదుపుతప్పి కొండ మీద నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. నువాకోట్‌లోని కిమ్‌తాంగ్ నుంచి సిసిఫు వెళ్తున్న ఓ ట్రక్కు సముంద్రతర్ వద్ద అదుపుతప్పి కొండపై నుంచి నదిలో పడింది. ఘటన సమయంలో ట్రక్కులో 40 నుంచి 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, భద్రతాసిబ్బంది, నేపాల్ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. అయితే ప్రమాదంలో 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖాట్మండూ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా తమ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES