భవనం పైనుంచి పడి ఐదుగురు కూలీల దుర్మరణం
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కూలీలు పదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ఘటనలో నలుగురు అక్కడకక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. జార్ఖండ్‌కు చెందిన యెషు కుమార్ చౌదరి(20), సుపాల్రాయ్(32), సైపుల్ హక్(26), అభిజిత్‌రాయ్(18), ఇలాన్ షేక్(20) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా.. విప్లవ్రాయ్ అనే వ్యక్తికి తీవ్రంగా గాయాలవడంతో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కీసర పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తోటి కూలీలు మృతి చెందడంతో మిగతా కూలీలు ఆగ్రహంతో నిర్మాణ సంస్థ కార్యాలయంలో అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఐదుగురు కూలీల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గుత్తేదారులు ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కూలీలు ఆరోపిస్తున్నారు.