క్రికెట్ లో ఫిక్సింగ్ వ్యవహారం రెండు దశాబ్ధాల క్రితం ప్రపంచాన్ని ఎంతగా ఊపేసిందో తెలియందికాదు. అప్పట్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఎంతోమంది క్రికెటర్ల జీవితాలను సర్వనాశనం చేసింది. అలా బలయినవారిలో మన దేశానికి చెందిన అజారుద్దీన్ కూడా ఉన్నాడు. ఆరోజుతో ముగిసిన అజారుద్ధీన్ క్రికెట్ జీవితం ఇక మళ్లీ గాడిన పడలేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అమీర్ సోహైల్ చేసిన ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ ప్రపంచంలో మరోసారి తీవ్ర అలజడిని రేపాయి. పాకిస్తాన్ క్రీడాకారులు క్రికెట్ ఆడటం మానేశారని, ఫిక్సింగ్ కు పాల్పడి గెలిచారంటూ ఆయన చేసిన ఆరోపణలు ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బుధవారం జరిగిన ఇంగ్లాండ్, పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్ గురయిందన్న విమర్శలు వచ్చాయి.
అంతకుముందు వరుసగా హ్యాట్రిక్ సాధించిన ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ చేతిలో చావుదెబ్బ తిన్నది. దీంతో అమీర్ సోహైల్ చేసిన ఆరోపణలు నిజమేనేమోననిపిస్తోంది. ఆట అయిపోయాక ప్రతిసారీ దేవుని దయ వల్ల గెలిచామనో, అంతా దేవుని దయ అనో చెప్పుకునే పాకిస్తాన్ కెప్టెన్ సర్పరాజ్.. ఆటగాళ్ల కృషి వల్ల గెలిచామని ఎందుకు చెప్పలేకపోతున్నాడని కూడా మాజీ కెప్టెన్ ప్రశ్నించాడు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సోహైల్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.