ఉత్తరప్రదేశ్ దియోబంద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్
ఆదిలాబాద్‌లో వెలుగు చూసిన 2 పాజిటివ్ కేసులు
అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం
దియోబంద్ లెక్కలపై పోలీసుల ఆరా షురూ
కరోనాపై హెచ్చరించే గడియారాన్ని కనుగొన్న సిరిసిల్ల యువతి
లండన్‌లో వరంగల్ విద్యార్థి కరోనాతో మృతి
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మరో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అంతా అయిపోయింది అనుకున్న తరుణంలో మర్కజ్ ప్రార్థనలు రాష్ట్రంలో పిడుగులా విరు చుకుపడగా, అవి కాస్తా అదుపులోకి వస్తున్నాయి అనుకుంటున్న తరుణం లో అలాంటిదే మరోటి విరుచుకుపడబోతోందా అన్న సంకేతాలు వచ్చే శాయి. ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌లో నిర్వహించిన మర్కజ్ తరహా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో సోమవారం ఇద్దరికి కరోనా పాజిటివ్ వెలుగు చూసింది. ఈ రెండు కేసులు ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూశా యి. వీటితో పాటు మరో కేసు కూడా బయట పడగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మూడు కొత్త పాజిటివ్ కేసులు నమోద య్యాయి. దియోబంద్‌కు వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ బయటపడడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రార్థనలకు జిల్లా నుంచి ఎందరు వెళ్లారు, వారు ఎక్కడెక్కడి వారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరితో సన్నిహితంగా మెదిలారు అనే లెక్కలను తీసే పనిని పోలీసులు మొదలు పెట్టారు. దియోబంద్ ప్రార్థనల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారా, లేక కొంత పరిమిత ప్రాంతాల వారే పాల్గొన్నారా అన్న విషయంపై కూడా విచారిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో పాజిటివ్ ఉన్న వారికి చికిత్సలు అందించగా లక్షణాలు ఉన్నవారు, అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచారు. వీరికి తొలి విడత క్వారంటైన గడువు పూర్తయింది. వీరిలో పాజిటివ్ తేలిన వారికి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్సలు అందిస్తుండగా, మిగిలిన వారికి నెగెటివ్ వచ్చినప్పటికీ మరో 14 రోజులు కూడా వైరస్ ఉండే అవకాశాలు ఉంటాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తుండడంతో వారికి రెండో దశ క్వారంటైన్‌లో ఉంచి మరోసారి రక్త నమూనాల పరీక్షలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇక్కడ ఏర్పాటు చేసిన నో మూవ్‌మెంట్ జోన్లలో ఆంక్షలను మరింత కఠినం చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రమే కరోనా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుండగా వరంగల్ రూరల్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఖమ్మం ఖిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకే కుటుంబంలోని వారివే ఐదు కావడం గమనార్హం. విద్యుత్ శాఖలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన వ్యక్తికి కరోనా రాగా ఆయన ద్వారా ఆయన కుటుంబసభ్యులకు సోకింది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు ఒక కేసులో మహేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఆయన చేతిపై క్వారంటైన్ ముద్ర ఉండడంతో కోర్టు అధికారులు అతినిని జైలులోకి రానీయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్‌జోన్లు, కాంటైన్మెంట్, హాట్‌స్పాట్ ప్రాంతాలలో సోమవారం పోలీసులు మరింత కఠినంగా ఆంక్షలను అమలు చేశారు. లండన్‌లో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ఒక విద్యార్థి కరోనాతో సోమవారం మృతి చెందారు. స్పెన్సార్‌తో శరీరం మొత్తం శానిటైజ్ చేసే పరికరాన్ని ఐఐటి కనుగొంది. సిరిసిల్లకు చెందిన స్నేహ అనే యువతి కరోనా ప్రమాదం ఉందంటూ అలారంతో హెచ్చరించే గడియారాన్ని కనిపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్న చేయి, ముక్కు, నోరు దగ్గరకు తీసుకువస్తే వెంటనే అలారంతో హెచ్చరిస్తుంది.
ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా 12 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం వరకు కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరులో 8, చిత్తూరులో రెండు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కో కేసు వెలుగుచూశాయి. నిన్నటి వరకు ఎపిని కర్నూల్ జిల్లా ఆందోళనకు గురిచేయగా తాజాగా గుంటూరు రాష్ట్రాన్ని వణికిస్తోంది. గుంటూరు సిటీని పూర్తిగా లాక్‌డౌన్ చేసినప్పటికీ సోమవారం నమోదైన 12 కేసుల్లో మూడోంతులు అంటే ఎనిమిది అక్కడే నమోదయ్యాయి. ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో మొత్తం 90 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నెగెటివ్ వచ్చిన వారికి కూడా రెండో సారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఈశాన్య రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతున్న కరోనా
ఈశాన్య రాష్ట్రాలకు కరోనా వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది. సోమవారం నాగాలాండ్‌లో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 35కు చేరింది. ఇక మహారాష్ట్ర దేశాన్ని వణికిస్తోంది. ఇక్కడ ఇప్పటి వరకు 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా దాదాపు 1300కేసులు ఒక్క ముంబయి నగరంలోనే ఉన్నాయి. తాజాగా ఒక్క రోజే 82 పాజిటివ్ కేసులు నమోదు కాగా ముంబయిలోని ధారావి మురికి వాడలోనే 42 పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వాడలో దాదాపు ఏడు లక్షలకుపైగా నివాసముంటున్నారు. తాజాగా మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అహ్వాడ్ కరోనా అనుమానంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దేశ వ్యాప్తంగా సోమవారం సాయంత్రం వరకు మొత్తం 9152 పాజిటివ్ కేసులు నమోదు కాగా 308 మంది మృతి చెందారు. 857 మంది కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 35 మంది మరణించారు. ఇక అసోంలో సాయంత్రం ఆరుగంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచడానికి అనుమతించారు. ఇదే ఆలోచనలో కర్ణాటక ఉన్నట్లు సమాచారం.