సెంచూర్యన్: ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ ఆఖరి మ్యాచ్‌లో మాత్రం సౌతాఫ్రికాను 27 పరుగులతో ఓడించి పరువు కాపాడుకుంది. బుధవారం రాత్రి జరిగిన మూడో టి20లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పాక్‌లో బాబర్ ఆజమ్ (11 బంతుల్లో 23), షాదాబ్ ఖాన్ (8 బంతుల్లో 22 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్ (26), ఆసిఫ్ అలీ (25) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో హెండ్రిక్స్ 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు క్రిస్ మోరీస్ రెండు వికెట్లు తీసి ఇతనికి అండగా నిలిచాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సౌతాఫ్రికాపై పాకిస్థాన్ బౌలర్లు విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచే దూకుడు కనబర్చుతూ వరుసక్రమంలో వికెట్లు పడగొట్టారు. వీరి ధాటికి ఓపెనర్లు 14 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వాన్ డెర్ డుసెన్ (41; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), క్రిస్ మోరీస్ (55 నాటౌట్; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడినా ఫలితం దక్కలేదు. చివరికి 20 ఓవర్లు పూర్తి అయ్యేసరికి సౌతాఫ్రికా 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. ఫలితంగా పాక్‌కు 27 పరుగుల ఓదార్పు విజయం దక్కింది. ఇక తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకున్న సౌతాఫ్రికా 2 సిరీస్ కైవసం చేసుకుంది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ అమీరు మూడు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, ఫహీమ్ అశ్రఫ్ చెరో రెండు వికెట్లు తీసి విజయంలో తమ వంతు సహకారం అందించారు. ఆల్‌రౌండర్ ప్రతిభ కనబర్చిన షాదాబ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సిరీస్‌లో చెలరేగి ఆడిన సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్‌కు ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డులు లభించాయి.
ఆఖరి మ్యాచ్‌లో పాక్ విజయం
RELATED ARTICLES