సుప్రీంలో సిబిఐ పిటిషన్.. రేపు విచారణ
న్యూఢిల్లీ: కోల్‌కతాలో శారదా కుంభకోణం దర్యాప్తు నేపథ్యంలో గత రాత్రి నుంచి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నించేందుకు సిబిఐ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో తాజా పరిణామాలను సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దర్యాప్తునకు సహకరించేలా సిపి రాజీవ్ కుమార్‌ను ఆదేశించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి రాజీవ్‌కుమార్‌కు పలుమార్లు సమన్లు జారీ చేశామని సిబిఐ తమ పిటిషన్‌లో పేర్కొంది. రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను అక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని పేర్కొంది. సిపి వెంటనే లొంగిపోయేలా ఆదేశించాలని కోరింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జెనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ పిటిషన్‌పై సోమవారం నాడు అత్యవసర విచారణ చేపట్టాలని తుషార్ కోర్టుకు విన్నవించారు. అయితే ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. రాజీవ్ కుమార్‌పై ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేనందున ఈ కేసును మంగళవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.