న్యాయవ్యవస్థలో వ్యక్తిగతానికి తావుండదు
సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
అమరావతిలో ఎపి హైకోర్టు శాశ్వత భవనానికి శంకుస్థాపన
అమరావతి: న్యాయవ్యవస్థలో రాజ్యాంగ విలువలకే తప్ప, వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. కేసుల సత్వర పూర్తికి కొన్ని అవాంతరాలున్నాయని, న్యాయమూర్తుల ఖాళీలు భర్తీ చేస్తే సమస్యలు తగ్గుతాయన్నా రు. కిందిస్థాయి, జిల్లా స్థాయి కోర్టుల్లోనూ 5వేల ఖాళీ లు ఉన్నాయని జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. ఆదివారం ఎపి హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు జస్టిస్ గొగోయ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు రావడం ఆనందదాయకమన్నారు. అత్యంత ఆధునిక శైలిలో హైకోర్టు భవనాన్ని నిర్మించారని చెప్పారు. హైకోర్టు భవనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతి, ఆనందానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విధిని సక్రమంగా, సకాలంలో సిఎం చంద్రబాబు నిర్వర్తించారని గొగొయ్ కొనియాడారు. ప్రజలకు న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన ఆశయమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. 179 రోజుల్లోనే కొత్త భవనాన్ని నిర్మించి ఎపి హైకోర్టు ఏర్పాటు చేశారని చెప్పారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమిని సేకరించి భవనం నిర్మించడం గొప్ప విషయమన్నారు. తెలుగు ప్రజలకు, హైకోర్టు భవనానికి భూములు ఇచ్చిన రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. అమరావతి కొత్త రాజధాని కాదని, శాతవాహనుల కాలంలోనే ధాన్యకటకం పేరుతో ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉండేదన్నారు. 1953లో పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గుర్తు చేశారు. 1953లో గుంటూరులో హైకోర్టు ఏర్పడిందని.. మళ్లీ ఇన్నాళ్లకు ఏపీ ప్రజల చెంతకే హైకోర్టు వచ్చిందని చెప్పారు.