ఖమ్మం బ్యూరో : స్నేహితుని ఇంటికి వచ్చి ఎండగా ఉందంటూ గోదావరిలో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మృతులంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినెనిప్రోలు రెడ్డిపాలెంకు చెందిన వారు. వివరాల్లోకి వెళితే…. గాదె విజయకుమార్‌రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులు గాదె పృథ్వీరెడ్డి, కుందురు సతీష్, కుందురు శ్రీనివాస్‌రెడ్డి, కారంపుడి దుర్గశేషు, తిరుమలరెడ్ది శివారెడ్డిలను ఆహ్వానించాడు. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాత వీరంతా సమీపంలో ఉన్న గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లిన తర్వాత ఆకస్మాత్తుగా లోతు పెరగడంతో మొదటగా ఉన్న కుందురు శ్రీనివాసరెడ్డి, కారంపుడి దుర్గశేషు, తిరుమలరెడ్డి శివారెడ్డి నదిలో మునిగిపోయారు. వారి కోసం పోలీసు బలగాలు, స్థానికులు ఎంత గాలించినా ఆచూకి లభ్యం కాలేదు. గోదావరి ఆ ప్రాంతంలో బాగా లోతుగా ఉండడం, వేగంగా ప్రవహిస్తుండడంతో మృతదేహాల గాలింపునకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఎండిఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించనున్నారు. మృతుల్లో శ్రీనివాసరెడ్డి ఇటీవల సారపాకలోని ఐటిసి కర్మాగారంలో ట్రైనీ ఉద్యోగిగా చేరాడు. మరో ఆరు నెలల్లో శిక్షణ ముగించుకుని ఉద్యోగంలో చేరాల్సిన వ్యక్తి గోదావరిలో పడి మరణించడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. దుర్గశేషు ఐటిసిలోనే క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి మృతిచెందడంతో తల్లి రమణమ్మ ఇడ్లీ బండిపెట్టి దుర్గశేషును చదివించింది. త్వరలో ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని భావిస్తున్న తరుణంలో ఉన్న ఒక్క కొడుకు చేజారిపోవడంతో ఆమె గుండెలు అవిసెలా రోదిస్తుంది. తిరుమలరెడ్డి శివారెడ్డిది కూడా అదే పరిస్థితి. విజయవాడలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే ఆయన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చి ఆ తర్వాత స్నేహితుని ఇంటికి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఎంతో స్నేహితంగా ఉండే ముగ్గురు గల్లంతు కావడం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో విషాదం నింపింది. ఘటన స్థలాన్ని పాల్వంచ డిఎస్పి మధుసూదన్‌రావు, సిఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. బూర్గంపాడు ఎస్ఐ వెంకటప్పయ్య, కుక్కునూరు ఎస్ఐ పైడిబాబు అక్కడే ఉండి మృతదేహాల కోసం జరుగుతున్న గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.