HomeNewsBreaking Newsఘనంగా ముగిస్తారా..

ఘనంగా ముగిస్తారా..

నేడు భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య చివరి వన్డే,

ధోనీ ఇన్‌, గుప్టిల్‌ ఔట్‌,

ఉదయం 7:30 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
వెల్లింగ్టన్‌: భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య నేడు చివరి వన్డే జరగనుంది. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలో దిగుతున్నాయి. వరుసగా మూడు విజయాలతో సిరీస్‌ సొంతం చేసుకున్న టీమిండియా హామిల్టన్‌ వెదికగా జరిగిన నాలుగో వన్డేలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇక స్వదేశంలో పేలవ ప్రదర్శనలతో నిరాశ పరుస్తున్న న్యూజిలాండ్‌ గురువారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి వరుస ఓటములకు చెక్‌ పెట్టింది. భారత్‌ ఆధిక్యాన్ని 3 చేర్చింది. నాలుగో వన్డేలో భారత జట్టులో విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ప్రపంచకప్‌ దృశ్య కోహ్లీకి విశ్రాంతి నివ్వగా ధోనీ గాయం కారంణంగా చివరి రెండు వన్డేల్లో ఆడలేక పోయాడు. వారిద్దరూ లేని టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ తడబడి వంద పరుగులలోపే కుప్పకూలింది. ఇక ఆదివారం జరిగే ఆఖరి వన్డేకి మహేంద్ర సింగ్‌ ధోనీ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టు అందుబాటులోకి వచ్చాడని భారత సెలెక్షన్‌ కమిటీ తెలిపింది. ఇది టీమిండియాకు శుభవార్త. ధోనీ తన అపారమైన అనుభవంతో జట్టును ముందుండి గెలిపించగలడు. ఏ సమయంలో ఏలాంటి నిర్ణయం తీసుకోనాలో అతనికి బాగా తెలుసు. ధోనీ రాకతో కివీస్‌ జట్టులో తిరిగి భయాలు మొదలయ్యాయి. ఇప్పుడు వారి టార్గెట్‌ ధోనీపై పెట్టారు. చివరి వన్డేలో గెలువాలంటే ధోనీని త్వరగా ఔట్‌ చేయాలని కివీస్‌ ఆటగాడు నిషమ్‌ పేర్కొన్నాడు. భారత జట్టులో కోహ్లీ, ధోనీ ఇద్దరూ ప్రమాదకరమైన ఆటగాళ్లు జట్టులో ఏ ఒక్కరు ఉన్న టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని నిషమ్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ధోనీని కట్టడి చేస్తే భారత్‌ను ఓడించడం సులువేనని ఈ యువ ఆటగాడు పేర్కొన్నాడు. ఇక చివరి వన్డేలో న్యూజిలాండ్‌ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక ఆటగాడు మార్టిన్‌ గుప్టిల్‌ గాయం కారణంగా ఆదివారం జరిగే మ్యాచ్‌కి దూరమయ్యాడు. ఇది తమకు పెద్ద షాకింగ్‌ న్యూస్‌ అనీ కివీస్‌ సారథి విలియమ్సన్‌ అన్నాడు. ప్రాక్టీస్‌ సెషన్‌లో గాయపడిన గుప్టిల్‌ త్వరగా కోలుకొంటాడని, భాతర్‌తో జరిగే టి20 సిరీస్‌ వరకు జట్టుకి అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక భారత్‌తో జరిగిన చివరి వన్డేలో తమ జట్టు ప్రదర్శన అమోఘమని, బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారని విలియమ్సన్‌ అన్నాడు. ఇక మిగిలిన ఈ వన్డేలోనూ అదే జోరును కొనసాగించి భారత్‌ను ఓడిస్తామని విలియమ్సన్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ముందు విదేశాల్లో భారత్‌కు ఇదే చివరి వన్డే. అనంతరం భారత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడనుంది. అందుకే ఈ మ్యాచ్‌ను గెలుపుతో ముగించాలని భారత్‌ ఆశిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే కొత్త చరిత్ర నమోదవుతోంది. న్యూజిలాండ్‌ గడ్డపై టీమిండియాకు ఇది అతి పెద్ద సిరీస్‌ విజయమవుతోంది. గెలుపుతోనే వన్డే సిరీస్‌కు ఘనంగా ముగింపు పలుకుతామని భారత సారథి రోహిత్‌ శర్మ అంటున్నాడు. గత మ్యాచ్‌లో చేసిన తప్పులు ఈ మ్యాచ్‌లో పునరావృతం కాకుండా చూసుకుంటామని రోహిత్‌ పేర్కొన్నాడు.
ఓపెనర్లే కీలకం..
చివరి మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో మైదానంలో అడుగుపెడుతుంది. భారత్‌ గెలువాలంటే ఓపెనర్ల పాత్రే ముఖ్యం. వారు శుభారంభాన్ని అందిస్తే భారీ పరుగులు సాధించొచ్చు. అందుకే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌లపై ఎక్కువగా ఆధారపడి ఉంది. మొదటి మూడు వన్డేల్లో చెలరేగి ఆడిన వీరు గురువారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం రాణించలేక పోయారు. వీరు త్వరగా ఔటవ్వడంతో మిగతా బ్యాట్స్‌మెన్స్‌ వీరి వెనుక వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివరి మ్యాచ్‌లో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నామని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్‌లో తామిద్దరం మంచి ఆరంభంతో గట్టి పునాది వేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. ఇద్దరూ పోటీపడి మరి బౌండరీలు కొడుతారు. ఒకవైపు హిట్‌ మ్యాన్‌, మరోవైపు గబ్బర్‌ ఇద్దరూ ఉన్నంత సేపు స్కోరుబోర్డుపై పరుగుల సునామీ పారడం ఖాయం. ఈ ఇద్దరూ తొలి 20 ఓవర్ల వరకు క్రీజులో నిలుచున్న భారత్‌ భారీ పరుగులు చేయగలదు. అందుకే వీరిని ఔట్‌ చేయడానికి ప్రత్యర్థి బౌలర్లు ప్రత్యేక ప్రణాళికలు అల్లుకున్నారు.
ధోనీ రాకతో..
ఇక సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులో చేరడంతో జట్టు బలం రెట్టింపయింది. ధోనీ ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాలను తారుమారు చేయగలడు. ఈ ఏడాది ఆరంభం నుంచి ధోనీ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుస హాఫ్‌ సెంచరీలతో చెలరేగి ఆడుతున్నాడు. చివరి ఆరు మ్యాచుల్లో నాలుగు సార్లు నాటౌట్‌గా ఉండి జట్టును విజయపతంలో నడిపించాడు. బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లోనూ ధోనీకి ఎదురులేదు. సెకన్ల వ్యవధిలోనే స్టంప్‌ చేయగలడు. వికెట్ల వెనుకనుంచే గ్రౌండ్‌ ఫీల్డింగ్‌ను అంచనా వేయగలడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ కదలికలను చురుగ్గా పసిగట్టగలడు. పరిస్థిని బట్టి ఫీల్డింగ్‌ను మార్చుతూ బౌలర్లతో పాటు కెప్టెన్‌కు మంచి సలహాలు ఇస్తూ జట్టుకు అండగా నిలుస్తాడు.
యువ ఆటగాళ్లకు మరో అవకాశం..
ఇక ఈ మ్యాచ్‌ భారత యువ ఆటగాళ్లకు మరో చాన్స్‌ ఇవ్వనుంది. తమ సత్తాను చాటుకునేందుకు ఇది గొప్ప అవకాశం. గత మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన శుభ్‌మన్‌ గిల్‌ను ఆఖరి వన్డేలోనూ అవకాశం ఇవ్వనున్నట్టు సమచారం. ఈ యువ ఆటగాడిపై టీమిండియా భారీ ఆశలు పెట్టుకుంది. రానున్న కాలంలో గిల్‌ భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ యువ పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశమిస్తారో చూడాలి. ఎందుకంటే గత మ్యాచ్‌లో ఖలీల్‌ అహ్మద్‌ను ఆడించినా అతను ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. అందుకే ఈ మ్యాచ్‌లో సిరాజ్‌ను తీసుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఒవరాల్‌గా టీమిండియా బౌలింగ్‌ దళం అద్భుతంగా ఉంది. ఇప్పటికే సిరీస్‌ గెలుచుకోవడంతో మిగిలిన మ్యాచుల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు కలిపిస్తున్నారు. భారత జట్టు ప్రధాన బౌలర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీలు విశ్రాంతిలో ఉన్నారు. ఇక భువనేశ్వర్‌ కుమార్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌, యాజువేంద్ర చాహల్‌ రూపంలో భారత బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. వీరు విజృంభించితే కివీస్‌ జట్టు తక్కువ స్కోరుకే పరిమితం కావడం ఖాయం.
ఆత్మవిశ్వాసంతో కివీస్‌..
గత మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే జోరును ఆదివారం జరిగే ఆఖరి వన్డేలోనూ కొనసాగించాలని భావిస్తోంది. హామిల్టన్‌ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కివీస్‌ 8 వికెట్లతో గొప్ప విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను 92 పరుగులకే పరిమితం చేసింది. కివీస్‌ పేసర్లు ట్రెంట్‌ బోల్ట్‌, గ్రాండ్‌హూమ్‌ నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను కట్టడి చేశారు. బోల్ట్‌ ఐదు వికెట్లు పడగొడితే.. గ్రాండ్‌హోమ్‌ మూడు వికెట్లతో చెలరేగాడు. వీరిద్దరి వళ్లే టీమిండియా తక్కువ స్కోరుకే చాపచూట్టుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌లో రాస్‌ టేలర్‌ విజృంభించి ఆడాడు. మరోవైపు నికోలాస్‌ రాణించడంతో న్యూజిలాండ్‌ 15 ఓవర్లు కూడా పూర్తి కాకుండానే ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్‌తో జరిగే చివరి పోరులో జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గుప్టిల్‌ గాయంతో తప్పుకున్నాడు. గత కొంత కాలంగా గుప్టిల్‌ ఓపెనర్‌గా జట్టుకి మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. గుప్టిల్‌ లేకపోవడం కివీస్‌ను కొంత మెరకు చింతుస్తున్నా మిగతా ఆటగాళ్లు అతని లోటును పూర్చేందుకు సిద్ధంగా ఉన్నారు. చివరి మ్యాచ్లో కివీస్‌ బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన చేసింది. పిచ్‌ స్వింగ్‌కు సహకరించడంతో బౌల్ట్‌ చెలరేగి బౌలింగ్‌ చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకుపడ్డాడు. ఇతర బౌలర్లు కూడా ఇతనికి సహకరించడంతో టీమిండియా తక్కువ స్కోరుకే కట్టడి అయింది. ఇక ఆదివారం జరిగే ఆఖరి వన్డేలోనూ విజయం తమదేనని బౌల్ట్‌ అంటున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments