సచివాలయానికి స్థల కేటాయింపు నిర్ణయం ఇక కేంద్ర ప్రభుత్వానిదే
ప్రజాపక్షం / హైదరాబాద్ (లీగల్): సికింద్రాబాద్ బైసన్ పోలో మైదానంలో తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. రక్షణశాఖ పరిధిలోని బైసన్ పోలో స్థలం కేటాయింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి హైకోర్టు అనుమతించింది.ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. బైసన్ పోలో గ్రౌండ్స్‌లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ భావించిన సంగతి, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మైదానంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున భూమి బదలాయింపు విషయంలో జాప్యం జరిగింది. తాజాగా మంగళవారం బైసన్‌పోలో గ్రౌండ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్థలంపై ఉన్న కేసులను కొట్టివేసింది. ఈ భూమిని సచివాలయ నిర్మాణానికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. సచివాలయ నిర్మాణంపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే బైసన్ పోలో గ్రౌండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరుస్తుందని, ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని టిఆర్ఎస్ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ రాష్టానికి కొత్తగా సచివాలయం, అసెంబ్లీ, కళాభవన్ నిర్మాణానికి సికింద్రాబాద్, బైసన్‌పోలో మైదానాన్ని ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను సూత్రప్రాయంగా ఆమోదించినట్లు కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. ప్రాథమిక అంగీకారం చెప్పినప్పటికీ షరతులు వర్తిస్తాయని తెలిపినట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని, ప్రజాహిత వ్యాజ్యాలను వచ్చే 12న విచారిస్తామని, ఈలోగా ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చిందీ లేనిదీ తెలియజేయాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాశేఖర్రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం ప్రభుత్వాలకు సూచన చేసింది.