అధికార పార్టీలకు బాకాలుగా మారిన మాధ్యమాలు
‘స్వతంత్ర’ వార్తాసంస్థల ఆవశ్యకత
‘ప్రజాన్యూస్’ డిజిటల్ ఛానల్ ప్రారంభోత్సవంలో సురవరం సుధాకర్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలో మీడియా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అవుతోందని, అధికార పార్టీలకు బాకాలుగా మారుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర వార్త లు, వ్యాఖ్యలు చేసే విధంగా వార్తా సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మఖ్దూంభవన్‌లో ‘ప్రజాన్యూస్’ డిజిటల్ ఛానల్‌ను సోమవారం సురవరం సుధాకర్‌రెడ్డి ప్రారంభించా రు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సాహిత్య అకాడమీ చైర్మన్ వందేమాతరం శ్రీనివాస్, సినీ నటుడు డాక్టర్ మాదాల రవి, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రజాన్యూస్ ఛానల్ సిఇఒ డాక్టర్ డి.సుధాకర్ ఛానల్ లోగోను ఆవిష్కరించారు. అనంతరం సురవరం మాట్లాడుతూ ప్రజా సమస్యలు ప్రతిబింబించేలా ప్రజా న్యూస్ ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావించే వార్తా సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మల్చుకోడానికి మీడియా, వార్తా సంస్థలను పాలకులు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రజాగళం వినిపించడానికి ప్రజా న్యూస్ ఎంతగానో దోహదపడుతుందని, వామపక్ష భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వందేమాతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజా న్యూస్ తన గొంతుక వినిపించాలన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని అవసరమన్నారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల గొంతుకగా ప్రజా న్యూస్ బడుగు, బలహీన వర్గాల వాణిని వినిపించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడాలని చెప్పారు. అశోక్ తేజ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల పక్షాన ప్రశ్నించేలా ప్రజా న్యూస్ ఉండాలన్నారు. నిరంతరం ప్రశ్నించేందుకు ప్రజా న్యూస్ దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మాదాల రవి మాట్లాడుతూ అగ్ని కంటే గొప్పది నిజం అని, నిజాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. వామపక్షాలు, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగిస్తున్నాయని, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజా న్యూస్ దోహద పడాలన్నారు. డాక్టర్ డి.సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిరంతరం ప్రసారం చేస్తామన్నారు.