నేడే తొలి విడత ‘పంచాయతీ’
మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్
అనంతరం లెక్కింపు, ఫలితాల ప్రకటన
3701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు
అత్యధికం నిర్మల్ జిల్లాలో 57, అత్యల్పం కరీంనగర్‌లో 4
12,202 మంది సర్పంచ్, 70,094 మంది వార్డులకు పోటీ
ప్రజాపక్షం / హైదరాబాద్ : తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏకగ్రీవాలు పోను 3701 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటిలో సర్పంచ్ స్థానాల కోసం 12,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 28,976 వార్డులకు పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 70,094 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 764 మంది, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 130 మంది పోటీ పడుతున్నారు. వార్డు సభ్యులకు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 5874 మంది, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 858 మంది తలపడుతున్నారు. తొలివిడతలో గ్రామీణ తెలంగాణం ఎవరి గానం ఆలపిస్తారనేది సోమవారం రాత్రిలోగా తేలిపోతుంది. అధికారపార్టీ 80 నుంచి 90శాతం పంచాయతీలుఏకగ్రీవం కావాలి, అవన్ని మన ఖాతాలో పడాలి అని ఎంతగానో శ్రమించింది. ఎమ్మెల్యేలు అహోరాత్రులు కష్టపడినా ఆశించిన ఫలితం అధికార పార్టీకి దక్కలేదు.తొలి విడతలో మొత్తం 4479 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా వీటిలో 769 పంచాయతీలలో మాత్రమే సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరో 3701 పంచాయతీల్లో హోరాహోరి పోరు జరిగింది. వీరిలో ఎవరిది పైచేయి, పల్లె ఓటర్లు ఎవరిని తమ గ్రామ ప్రథమ పౌరునిగా ఎన్నుకుంటారనేది మరి కొద్ది గంట ల్లో తేటతెల్లం కానుంది అలాగే తొలి విడతలో మొత్తం 39,822 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, వీటిలో 10,654 వార్డులు ఏకగ్రీవం అయ్యా యి. మరో 28,976 వార్డులకు ప్రచారపర్వం నువ్వానేనా అన్న విధంగా జరిగింది. తొలి విడతలో అధికార పార్టీ నిర్దేశించుకున్న లక్ష్యంలో నాలుగో వంతు కూడా సాధించలేకపోయింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ అధికార, విపక్షాలు బహిరంగంగానే తాము బలపరుస్తున్న అభ్యర్థులను బరిలోకి దిం చింది. దీంతో ఫలితాల అనంతరం విజ యం అధికారపార్టీదా, విపక్షాలదా అన్నది తెలిసిపోతుంది. ఈ సారి కొత్త పంచాయతీరాజ్ చట్టం రాష్ట్రంలో అమలులోకి రావ డం, దీని ద్వారా సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులకు విశేషాధికారాలు ఉండడం కూడా పోటీ నెలకొనడానికి ఒక కారణమైంది. ఏకగ్రీవమయిన వాటిలో 57 పంచాయతీలతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో ఉండగా అత్యల్పంగా నాలుగు పంచాయతీలతో మేడ్చల్, కరీంనగర్ జిల్లాలు చివరి స్థానంలో నిలిచాయి.