12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్
భారత్ తరఫున జిఎమ్ ఫీట్ అందకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు
చెన్నై్ల: ఆడుతూ పాడుతూ గడపడాల్సిన వయసులో భారత్ యువ చెస్ క్రీడాకారుడు డి. గుకేష్ సంచలనం సృష్టించాడు. అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ నార్మ్ అందుకున్న తొలి భారత యువ చెస్ ఆటగాడిగా సరికొత్త రికార్డును దొమ్మరాజు గుకేష్ సొంతం చేసుకున్నాడు. గుకేష్ ఈ ఫీట్‌ను 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల్లో సాధించాడు. అంతకుముందు 2016లో ప్రజ్ఞానందా (12 ఏళ్ల 10 నెలల్లో) నెలకొల్పిన రికార్డును తాజాగా గుకేష్ చెరిపేశాడు. మరోవైపు ప్రపంచ చెస్ చరిత్రలో తక్కువ వయసులో జిఎమ్ అందుకున్న యువ ఆటగాళ్లలో డి. గుకేష్ రెండో స్థానంలో నిలిచాడు. ఇతని కంటే ముందు ఉజ్బేకిస్థాన్‌కు చెందిన జవొకీర్ సిండరోవ్ (12 ఏళ్లు 10 నెలలు ఐదు రోజుల్లో) ఈ గ్రాండ్ మాస్టర్ ఫీట్‌ను అందుకుని మొదటి స్థానంలో ఉన్నాడు. గత ఏడాది అక్టోబర్ నెలలో సిండరోవ్ ఈ ఘనతను సాధించాడు. ఇతను గుకేష్ కంటే కేవలం మూడు రోజుల ముందు ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. తాజాగా ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ మీట్‌లో మూడో జిఎమ్ నార్మ్‌ను అందుకున్నాడు. అక్టోబర్ 2017లో 2322 రేటింగ్ పాయింట్లు సాధించిన గుకేష్ ఖాతాలో ఒక్క నార్మ్ కూడా లేదు. తర్వాత 16 నెలల్లోనే మూడు నార్మ్‌లతో పాటు 2500 రేటింగ్స్ పాయింట్ సాధించి గ్రాండ్ మాస్టర్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. ఇతను 2018 నుంచి చెస్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బ్యాంగ్‌కాక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో గుకేష్ తొలి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను అందకున్నాడు. తర్వాత కూడా అదే దూకుడును కనబర్చిన గుకేష్ తర్వాత సెర్బియాలో జరిగిన రౌండ్ రాబిన్ టోర్నమెంట్‌లో రెండో జిఎమ్ నార్మ్‌ను అందుకున్నాడు ఇప్పుడు తాజాగా ఢిల్లీ ఓపెన్ చెస్ టోర్నీలో మూడో నార్మ్‌తో గ్రాండ్ మాస్టర్ కితాబు సొంతం చేసుకున్నాడు. గుకేష్ చెన్నైలోని వెలమ్మల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఇతని తండ్రి రజనీకాంత్ ప్రయివేట్ ఆసుపత్రిలో ఇఎన్‌టి సర్జన్‌గా పనిచేస్తున్నాడు. అమ్మ పద్మా కుమారి కూడా డాక్టర్‌గా ప్రక్టీస్ చేస్తున్నారు. ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత తొలి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ అంటే గుకేష్ చాలా ఇష్టం. ఆనంద్‌ను ఐడియల్‌గా భావిస్తాడు. అతని ఆటను చూసి నేర్చుకుంటానని గుకేష్ పేర్కొన్నాడు. ఆనంద్‌తో పాటు బాబి ఫిస్చెర్ అంటే కూడా వీరాభిమానమని గుకేష్ అన్నాడు.
గుకేష్ సంచలనం
RELATED ARTICLES