ఫెడరల్ ఫ్రంట్‌పై వైసిపి, టిఆర్ఎస్ మధ్య చర్చలు
హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్‌పై వైసిపి, టిఆర్ఎస్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ నేతలు కెటిఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులు బుధవారం లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు. అనంతరం ఇరువురు నాయకులు మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడుతూ దేశరాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని సమాఖ్య స్ఫూర్తితో జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావించారని తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగానే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలను కలిసి మద్దతు కోరినట్లు చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ఎపి ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడామని, ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆయనతో భేటీ అయ్యామని తెలిపారు. ఇటీవల కెసిఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, పార్టీ అధ్యక్షులతో చర్చించారో అదే విధంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ వెళ్లి జగన్‌తో భేటీ అవుతారని చెప్పారు.
వైసిపి అధినేత జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ తనకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కెటిఆర్ వచ్చి చర్చించారని తెలిపారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలంటే, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలవాల్సి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీకే దిక్కు లేకుండా పోయిందని, ఇలాంటి వాటిని అధిగమించాలంటే ఒక్కో రాష్ట్రం పరిధిలో వాళ్లకున్న ఎంపీల సంఖ్య సరిపోదని, మాకు తోడు తెలంగాణ నుంచి 17మంది ఎంపీలు కూడా జతకూడితే, మొత్తం 42మంది ఎంపీలు ఒకే తాటిపైకి వచ్చి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడితే మేలు జరిగే పరిస్థితి ఉంటుందన్నారు. ఇప్పడు కెటిఆర్ చర్చించారని, త్వరలో కెసిఆర్ కూడా తనతో భేటీ అవుతారని చెప్పారు.