ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
పర్యావరణ అనుమతులు ఇచ్చిన కేంద్రం
రూ.13,384 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాజెక్టు
2.72 లక్షల హెక్టార్లకు సాగునీరు
మూడేళ్లలో పూర్తయ్యేలా ప్రణాళికలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేసి దాదాపు నాలుగేళ్లు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి కూడా దాదాపు నాలుగేళ్లు అవుతోంది. కేంద్రం నుంచి రావాల్సిన కీలకమైన పర్యావరణ అనుమతులు లేక పనులు ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇది పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 2.72 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుంది. ఇది సీతారామ ప్రాజెక్టు స్వరూపం. ముఖ్యమంత్రిగా రెండవ సారి ఎన్నికైన కెసిఆర్ ఈ ఐదేళ్లలో తాము మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఇటీవలే ప్రకటించారు. రెండవ సారి సిఎంగా ఎన్నికైన అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశారు. ఇందు లో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖను కలిసి రాష్ట్రంలో సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆయన విన్నపాన్ని కేంద్రం మన్నించిందో లేక నిజంగానే సీతారామకు పర్యావరణ అడ్డంకులు లేవో కానీ మొత్తానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టుకు సోమవారం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. సంబంధిత లేఖ మంగళవారం రాష్ట్ర నీటి పారుదలశాఖకు చేరింది. నిర్మా ణం పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు సాగునీరందుతుంది.దీంతో పాటు మరో 1,39,836 హెక్టార్ల సాగు భూమి స్థిరీకరణ జరుగుతుంది. మొత్తం మీద ఈ ప్రాజెక్టు అనుకున్న విధంగా రూపుదిద్దుకుంటే మొత్తం 2,72,921 హెక్టార్ల సాగుభూమికి నీరందుతుంది. ఈ ప్రాజెక్టును దుమ్మగూడెం ఆనకట్ట వద్ద నుంచి గోదావరి నీటిని మళ్లించడం ద్వారా ఈ భూములకు సాగునీరందించేలా ప్రాజెక్టును రూపొ ందించారు.పై నాలుగు జిల్లాల్లోని 180 గ్రామాల వారికి ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి చేకూరుతుంది. రూ.13,384.80కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. మూడేళ్లలో పూర్తి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం గతేడాది డిసెంబర్లోనే ప్రజాభిప్రాయ సేకరణను పూర్తిచేశారు. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఒక హెడ్ రెగులేటర్ను నిర్మిస్తారు. నాలుగు జిల్లాల్లో కలిపి 372 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వుతారు. నాలుగు పంప్‌హౌస్‌లను నిర్మించనున్నారు.