ఆలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: సిబిఐ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సిబిఐ కేసులో కేంద్రం వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ సెలవులో ఉండడంతో తీర్పును మరో న్యాయమూర్తి జస్టిస్ కౌల్ చదివి వినిపించారు. కేంద్రం ఆయనకు అధికారాలు లేకుండా చేసి సెలవుపై పంపడాన్ని న్యాయస్థానం తప్పు పట్టింది. ఆయనను అలా సెలవులో పంపడం కుదరదని, వెంటనే బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నత కమిటీ వారంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ సమయంలో ఆలోక్ వర్మ విధానపరమైన, ప్రధాన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించింది. అలాగే సిబిఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం.నాగేశ్వరరావు నియామకాన్ని కూడా సుప్రీం పక్కన పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తనను బలవంతంగా సెలవుపై పంపడాన్ని సవాలు చేస్తూ ఆలోక్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు వెలువరించింది.