దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సమాయత్తం
ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ముందుకు రాకపోవడంతో మరోసారి సమ్మెబాట పట్టిన కార్మికులు
తెలంగాణ ఆర్‌టిసిలో సమ్మె సైరన్
ప్రజాపక్షం / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీ య స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జనవరి 8,9 తేదీల్లో దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు జరిగే సమ్మెను రాష్ట్రంలో విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాయి. గత కొన్ని రోజులుగా జిల్లాల వారిగా సమ్మె సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికుల్లోనూ, ప్రజల్లోనూ అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాయి. అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా చేపడుతున్న ఈ సార్వత్రిక సమ్మెకు అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది. ప్రధాన మైన 12 డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 2, 2015, సెప్టెంబర్ 2, 2016 తేదీల్లోనూ దేశవ్యాపితంగా సార్వత్రిక సమ్మె జరిగింది. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ఈ సారి 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు.సులభతర వాణిజ్యం పేరుతో ప్రభుత్వాలు కొత్త మార్గాల ద్వారా కార్మికులను దోపిడీకి గురిచేస్తున్నాయి. ఔట్ సోర్సింగ్, ఫిక్స్‌డ్ ఎంప్లాయ్‌మెంట్, అంప్రెంటిస్ పద్ధతుల్లో ఉపాధిని తాత్కాలికమైనదిగా మార్చేస్తున్నాయి. 44 కేంద్ర కార్మిక చట్టాలను మార్చివేసి వాటిని నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి వేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా సమ్మెకు సర్వం సిద్ధమయింది.