సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టులో కంగారూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 622/7 (డిక్లేర్డ్) భారీ స్కోరును సాధించింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 322 పరుగులతో వెనుకబడ్డ ఆసీస్ ఫాలోఆన్‌ను తప్పించుకోలేక పోయింది. భారత సారథి విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా జట్టును ఫాలోఆన్ ఆడించాడు. ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌లో రారాజులుగా ఎదిగిన ఆసీస్ జట్టు తమ సొంత గడ్డపై ఫాలోఆన్ ఆడటం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆసీస్‌ను వారి హోమ్‌పిచ్‌పై ఫాలోఆన్ ఆడించిన ఘనత కోహ్లీ సేనకు సొంతమయింది. అంతకుముందు ఇదే సిడ్నీ వేదికగా 1988లో ఇంగ్లాండ్‌తో జరగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఆసీస్ జట్టు ఫాలోఆన్ ఆడింది. చివరికి ఆ మ్యాచ్‌ను కంగారూ జట్టు డ్రాతో గట్టెక్కింది. ఇక విదేశాల్లో ఆస్ట్రేలియా జట్టు చివరి సారిగా 2005లో ఫాలోఆన్ ఆడింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఆసీస్ ఫాలోఆన్ ఆడింది. అయితే ఆ మ్యాచ్‌లో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు.