పరస్పర ఆరోపణలు : బహిరంగ సవాళ్లు
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్లో ముదురుతున్న వర్గపోరు
అధిష్టానంపై కార్యకర్తల గుర్రు
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాక ముందు ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రభావం నామ మాత్రంగానే ఉండేది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుండి బలమైన నేతలు టిఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బలీయ రాజకీయశక్తిగా ఎదిగింది. 2018 శాసనసభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుందని ఖమ్మం జిల్లా కార్యకర్తల నుంచి అధిష్టానం వరకు ఆశించారు. కానీ. చావు తప్పి కన్నులోట్లపోయినట్లు ఒకే ఒక్క సీటుతో టిఆర్ఎస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టిఆర్ఎస్ నేతలు ఎన్నికల ప్రచార సందర్భంగా పది స్థానాల్లో గెలుస్తామని చెప్పినా గౌరవనీయ స్థానాలే సాధిస్తుందని పరిశీలకులు సై తం అంచనా వేశారు. ముఖ్యంగా ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం, భద్రాచలంలో గెలుపు తథ్యమనుకున్నారు. అయితే ఖమ్మం మినహా ఎక్కడ విజయం సాధించలేదు. వందల కోట్ల రూపాయలతో పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్లోని అంతర్గత పోరుతో ఓటమి చెందక తప్పలేదు. ఒక దెబ్బకు ఆరు పిట్టలు అన్నట్లు ఒక నాయకుని దెబ్బకు ఆరు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసింది. ఎన్నికలకు ముందు అంతా హాయిభాయి అంటూ గులాబీ కండువాలతో ప్రజల ముందు నటించినా వెనుక నుంచి కత్తులతో పొడుచుకున్నారు. ఓటమి చెందిన తర్వాత అయినా మార్పు వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు వర్గపోరు మరింతగా పెరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో కనీసం సమీక్షా సమావేశం పెట్టలేని పరిస్థితి నెలకొంది. వైరా నియోజకవర్గంలో టిఆర్ఎస్లోనూ ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం బహిరంగంగా స్వతంత్ర అభ్యర్థితో జత కట్టింది. ప్రత్యర్థికి అర్ధ బలాన్ని సమకూర్చడమే కాకుండా అధికార టిఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్‌కు అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. చివరకు స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా వెంటనే ఆయనకు టిఆర్ఎస్ తీర్థం ఇప్పించారు. ఇప్పుడు వైరా నియోజక వర్గంలో టిఆర్ఎస్ అంటే ఎవరన్నది కార్యకర్తల నుంచి ఎదురవుతున్న ప్రశ్న కారు గుర్తుపై పోటీ చేసి ఓటమి చవిచూసిన మదన్లాలా, టిఆర్ఎస్కు వ్యతిరేకంగా బరిలో నిలిచి గెలుపొందిన రాములునాయకా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. ఇక్కడ కనీసం సమీక్షా సమావేశం పెట్టే పరిస్థితి లేదు. ఇక పాలేరు నియోజకవర్గంలో ఓటమి తర్వాత తొలిసారి గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు ఎంపి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓటమికి ఎంపియే కారణమని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మాజీమంత్రి సైతం మాట్లాడే సందర్భంలో ఉద్విగ్నతకు గురయ్యారు. ఖమ్మం ఓటమిని సిఎం సైతం జీర్ణించుకోలేకపోతున్నారని తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ తుమ్మలకు వ్యతిరేకంగా పనిచేసిన టిఆర్ఎస్ నేతలు సమావేశానికి డుమ్మా కొట్టారు. అదే పరిస్థితి సత్తుపల్లి నియోజకవర్గంలోనూ నెలకొంది. ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరుగాంచిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం ప్రసాద్‌లతో పాటు డిసిసిబి ఛైర్మన్ మువ్వా విజయబాబు, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ కలిసిన సత్తుపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారు. ఇక్కడ టిడిపి అభ్యర్థి సండ్రకు భారీ మెజార్టీ లభించింది. సత్తుపల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవకపోతే తాను మంత్రివర్గంలో చేరబోనంటూ తుమ్మల ప్రకటించారు. అయినా ఇక్కడ ఓటమి చవిచూడడానికి ఎంపి వర్గీయులే కారణమంటూ ఓటమి చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి ఆరోపించారు.