అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
కరీంనగర్: ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు మేడిగడ్డ పనులు పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇంజినీర్లను ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా ఆయన మంగళవారం నాడు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయల్దేరి విహంగ వీక్షణం ద్వారా మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా తొలుత మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు ఏయే దశల్లో ఉన్నాయి, ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను ఇంజినీర్లు సిఎంకు వివరించారు. రికార్డు స్థాయిలో కాంక్రీటు పనుల్ని పూర్తి చేస్తున్నామని అధికారులు వివరించారు. పనుల్లో వేగం పెరిగేందుకు కెసిఆర్ పలు సూచనలు చేశారు. కాంక్రీటుతో పాటు మోటార్ల బిగింపు తదితర పనులు కూడా సమాంతరంగా జరిగేలా చూడాలని చెప్పారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలంటే మేడిగడ్డ పూర్తికావడం కీలకమని సిఎం ఇంజినీర్లతో అన్నారు. కెసిఆర్ సూచన మేరకు ఇంజినీర్లు పనుల పురోగతిపై ఫొటో ప్రదర్శన ద్వారా వివరించారు. అనంతరం సిఎం కెసిఆర్ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పంపు హౌస్ నిర్మాణం పనులను పరిశీలించారు. అయితే మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన సిఎం కెసిఆర్‌కు భూపాలపల్లి, మంథని ఎంఎల్ఎలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట సిఎస్ ఎస్‌కె జోషి, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, డిజిపి మహేందర్ రెడ్డి, ఎంఎల్‌సి రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఎ వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.