రెండోసారి సిఎం అయ్యాక ఆయన నిజస్వరూపం బయటపడుతోంది
యువకుడిగా ఉన్నప్పుడు చేసిన దగుల్బాజి, బ్రోకర్ పనులు మరిచిపోయినట్లు లేదు
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు రమణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : విలువలు, నైతికత, ఇంగితజ్ఞానం లేని సిఎం కెసిఆర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యుడు ఎల్.రమణ విమర్శించారు. ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కెసిఆర్ నిజస్వరూపం బయటపడుతోందని చెప్పారు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు చేసిన దగుల్బాజి పనులు, బ్రోకర్ పనులు సిఎం అయిన తర్వాత కూడా మర్చిపోలేదన్న విషయం ఆయన మాటలతో తెలుస్తోందన్నారు. పాస్‌పోర్టుల కేసులో ఢిల్లీలో కెసిఆర్‌పై కేసు పెడితే ఏ పార్టీ నాయకుడు వదిలిపెట్టారో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వందలకోట్ల రూపాయల నగదు పంపిణీచేసి ప్రత్యర్థులు ఎవరు లేరనే అహంతో ముందస్తుకు వెల్లారని ఆరోపించారు. కెసిఆర్ కుట్రలను అడ్డుకునేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేశామని చెప్పారు. తన అధికారంతో కెసిఆర్ అడ్డగోలు పనులు చేస్తారని తెలిసినప్పటికీ ఎదుర్కున్నామన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతలతో కార్యక్రమాలు చేపడుతూ ముందుకుపోతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలలో 16 స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పుతానంటున్నారని, ఈ సంఖ్య మొత్తం లోక్‌సభ సభ్యుల సంఖ్యలో కేవలం మూడు శాతమేనన్నారు. ద్వంద విధానాలతో మసిపూసి మారెడుకాయ చేయడం కెసిఆర్‌కు అలవాటేనన్నారు. లక్ష ఉద్యోగాలు, పేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు, హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తాననడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.