HomeNewsLatest Newsసంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రివర్గం

సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రివర్గం

డిప్యూటీ సిఎం పదవులపైన పరిశీలన
పార్లమెంటర్‌ సెక్రెటరీల నియామకం
మంత్రివర్గంలో కెటిఆర్‌పై సర్వత్రా ఉత్కంఠ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత చేయనున్నట్లు తెలిసింది. ముందుగా 8 నుంచి 10 మందితోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ కూర్పు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గం కేవలం 18 మందికే పరిమితం కావడంతో పార్లమెంట్‌ సెక్రెటరీలను నియమించాలని భావిస్తున్న కెసిఆర్‌, అందుకు వీలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, ఈ విషయమై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నారు. ఒకటి, రెండు సార్లు ఎన్నికైన ఎంఎల్‌ఎలకు పార్లమెంట్‌ సెక్రెటరీలుగా నియమించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండాలా.? వద్దా అనే అంశాన్ని కూడా కెసిఆర్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. సంక్రాంతి తర్వాత దాదాపుగా 16 నుంచి 20 తేదీ లోపు మంత్రివర్గ కూర్పు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే కెటి.రామారావుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలను అప్పగించిన నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో ఉంటారా? లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి, ఉత్కంఠత నెలకొన్నది. సిఎం కెసిఆర్‌ ఫెడరల్‌ ప్రంట్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగణంగా కెటిఆర్‌కు కీలక బాధ్యతలు ఇస్తారనే అంశం కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక వ్యూహాంతో ముందుకు సాగుతున్న కెటిఆర్‌, సంక్రాంతి తర్వాత జిల్లాల వారిగా పర్యటించనున్నారు. జిల్లా పార్టీ కార్యాలయాల పనులకు శంకుస్థాపనల్లో నిమగ్నం కానున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో “టార్గెట్‌ 16 ఎంపిలు” గా పెట్టుకున్న కెటిఆర్‌ అందుకు వీలుగానే క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. కాగా కెటిఆర్‌ లోక్‌సభ ఎన్నికల తర్వాతనే మంత్రివర్గంలోకి వెళ్తారా..? లేదా ప్రస్తుతం మంత్రి పదవితో పాటు పార్టీ బాధ్యతలను నిర్వహిస్తారా అనేది పార్టీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments