సిఎంకు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ బహిరంగ లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ : అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన బిసి రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంగళవారం ఆయన బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 15న తీసుకొచ్చిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ అప్రజాస్వామిక చర్యగా ఆ లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలలో బిసి రిజర్వేషన్లను తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో బిసి జనాభాను చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం కులగణన చేపట్టాలని కోరారు. ఎబిసిడిఇ వర్గీకరణ ప్రకారం కుల గణన చేపట్టిన బిసి రిజర్వేషన్లు బిసి జనాభా ఆధారంగా కేటాయించాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రద్దు అయిన ఓటర్లు తిరిగి తమ పేర్లు నమోదు చేసుకునేలా అవకాశం కల్పించి ఓటర్ల హక్కును కాపాడాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను తగ్గించడం పట్ల మొత్తం బిసిలంతా కూడా ఆందోళనకరంగా ఉన్నారన్నారు. బిసిల గణనను సమగ్రంగా జరపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పాటించక పోవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని, బిసి ఓటర్లు ఎంత మంది ఉన్నారన్నది లెక్కించడం పెద్ద సమస్య ఏమీ కాదన్నారు. పాత ఓటర్ల జాబితాతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడంపై ఉత్తమ్ అభ్యంతరం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 22 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు అయ్యాయని, ఈ విషయాన్ని సిఇఒ రజత్ కుమార్ దృష్టికి కూడా కాంగ్రెస్ తీసుకెళ్లిందని గుర్తు చేశారు.