కశ్మీర్లో అమరవీరుడైన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసి రాజేష్ దక్వా
రవీంద్రనగర్‌లో విషాదఛాయలు, కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
ప్రజాపక్షం/ ఆసిఫాబాద్/ చింతలమానపల్లి : జమ్మూకశ్మీర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఎదురు కాల్పు ల్లో కొమురంభీం జిల్లా చింతలమానేపల్లి మండలం, రవీంద్రనగర్ గ్రామానికి చెందిన జవాన్ రాజేష్ దక్వా మృతి చెందారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయ లు అలుముకున్నాయి. మన్మోహన్, లతిక దంపతులకు 1978 లో రాజేష్ దక్వా జన్మించారు. 1997లో ఆర్మీలో సోల్జర్‌గా చేరారు. లంచ్ నాయర్, నాయర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం పోస్టు హల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం జరిగిన ఎదురు కాల్పుల్లో రాజేష్ మృతి చెందారు. దీంతో రవీంద్రనగర్ గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రాజేష్ దక్వాకు భార్య జయ, ఇద్దరు కుమార్తెలు రోహిణి, కృషి ఉన్నారు. రాజేష్ దక్వా తల్లి లతిక రోదన అక్కడి వారిని కలచివేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వగ్రామానికి వచ్చిన రాజేష్ దక్వా ఓటు వేసి తిరిగి విధుల్లో చేరారు. పది రోజులు కూడా గడవక ముందే ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా జవాన్ రాజేష్ దక్వా మృతదేహం స్వగ్రామానికి మంగళవారం రాత్రి చేరే అవకాశాలున్నాయి.