భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి
మెల్‌బోర్న్: మేము ఇక్కడ మైదానంలో కష్టపడుతుంటే మరి కొందరు అక్కడ భారత్‌లో కూర్చొని విమర్శలు చేయడం సరికాదని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇక్కడి పరిస్థితుల గురించి లక్షల మైళ్ల దూరంలో కూర్చొని అంచనా వేయడం సబబుకాదని ఇక్కడ ఉన్న వారికే ఇక్కడి పరిస్థితుల గురించి తెలుస్తోందని ఆయన అన్నారు. పెర్త్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ 146 పరుగులతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం భారత కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం తప్పని సునీల్ గవాస్కర్‌తో పాటు ఇతర మాజీలు ఆరోపణలు చేశారు. గాయం కారణంగా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో రవీంద్ర జడేజాను ఆడిస్తారని అందరూ భావించారు. కానీ అలా జరుగలేదు. పెర్త్ టెస్టులో టీమిండియా స్పిన్నర్ లేకుండానే బరిలో దిగడంపై భారీ ఎత్తున విమర్శలు లేవనెత్తాయి. పిచ్‌ను అంచనా వేయడంలో విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి పొరపాటుపడ్డారని మాజీలు అన్నారు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని భావించిన వీరు స్పిన్నర్ లేకుండానే మైదానంలో అడుగుపెట్టారు. కానీ ఆ టెస్టులో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కంటే స్పిన్‌కే అనుకూలించింది. ఆసీస్ స్పిన్నర్ అద్భుతంగా రాణించి రెండో టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌ను ఆసీస్‌కు గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం భారత సెలెక్షన్ విభాగంపై పెద్ద ఎత్తును విమర్శలు లేవనెత్తాయి. తాజాగా స్పందించిన భారత కోచ్ రవిశాస్త్రి విమర్శలు చేస్తున్న వారికి ఘాటుగా బదులిచ్చారు. ఎవరి పేర్లూ ప్రస్తావించకుండానే అందరిపై ఘాటుగా స్పిందించారు. ఇక్కడ ఉన్న వారికే పరిస్థితుల గురించి అవగాహన ఉంటుంది. ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పని కాదన్నారు. అప్పటి పరిస్థితులను బట్టే జడేజాను తీసుకోలేదు. అది అంత పెద్ద తప్పుకాదన్నారు. తొలి టెస్టులో గొప్ప విజయం సాధించాము. రెండో టెస్టులో కూడా పోరాడాం కానీ, గెలుపు వరించలేదు. ఇప్పుడు మా దృష్ట్టినంతా మూడో టెస్టుపైనే పెట్టాం. మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభమయే టెస్టులో విజయం భారత్‌దేనని శాస్త్రి అన్నారు. జట్టులో ఓపెనర్ల సమస్య ఉంది. ఈసారి అది కూడా తీరిపోతుందని భావిస్తున్నానని అన్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ తడబడుతున్నారు. కానీ వారికి అపార అనుభవం ఉంది. వారు ఈ సారి తప్పనిసరిగా పుంజుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన సత్తా చాటుతున్నాడు. భారత్-ఎ తరఫున మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సారి అతనిని జట్టులో తీసుకోవాలో వద్దో ఆలోచిస్తున్నామన్నారు. విరాట్ కోహ్లీ మంచి స్వభావంగల ఆటగాడు. కొందరు కావాలనే అతనిపై తప్పుడు అరోపణలు చేస్తున్నారు. అతడు మైదానంలో దూకుడుగానే ఉంటాడు. అది అతని నైజం. అతను హద్దు దాటలేదని మాకు తెలుసని శాస్త్రి అన్నారు. ప్రస్తుతం మేము 1-1తో సరీస్‌లో సమంగా ఉన్నాం. మూడో టెస్టులో విజయం సాధించి తిరిగి ఆధిక్యంలో దూసుకెళ్లుతామని ఆయన అన్నారు. భారత జట్టు యువ ఆటగాళ్లతో బలంగా ఉంది. తమ ఆటగాళ్లు మంచి హోంవర్క్ చేసి తర్వాతి టెస్టుకు సిద్ధమవుతున్నారని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు.
జడేజా ఫిట్‌గా లేడు…
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వంద శాతం ఫిట్‌గా లేడని కోచ్ రవిశాస్త్రి అన్నారు. పెర్త్ టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించే వరకు అతని గురించి పెద్దగా తెలియదు. భారత్‌లో రంజీ క్రికెట్ ఆడుతున్న సమయంలో కూడా జడేజా భుజం నొప్పితో బాధపడ్డాడని ఆయన అన్నారు. తర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికైన తర్వాత రెండో టెస్టు కోసం అతని పేరు ప్రస్తావించినప్పుడు అతని గాయం గురించి తెలిసిందని శాస్త్రి అన్నారు. పెర్త్ టెస్టు సమయంలో జడేజా 70-80 శాతం ఫిట్‌గా ఉన్నట్టు తెలిసింది. అందుకే అతనిని ఆ టెస్టులో ఆడించాలని నిర్ణయించుకోలేదని చెప్పారు. మెల్‌బోర్న్ టెస్టుకు ఇంక కాస్త సమయం ఉండడంతో అప్పటివరకు అశ్విన్ కోలుకుంటాడో చూడాలి. ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మ కూడా కోలుకున్నాడు. మంగళవారం వరకు మెల్‌బోర్న్ టెస్టు కోసం పూర్తి జట్టును ప్రకటిస్తామని రవిశాస్త్రి అన్నారు.
విమర్శించడం సరికాదు
RELATED ARTICLES