కాలిఫోర్నియాలో వింత మెరుపు!
విస్తృతంగా ఫోటోలు తీసిన ప్రజలు
అది గ్రహాంతర వాసుల ఆచూకీ సంకేతం కావచ్చు : శాస్త్రవేత్తలు
కాలిఫోర్నియా : అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుకోకుండా ఆకాశంలో కన్పించిన ఓ వింత మెరుపు కలకలం రేపింది. అంతుచిక్కని ఈ కాంతిపుంజం ఏమైవుంటుందా అని శాస్త్రవేత్తలు తలలు పట్టుక్కూర్చున్నారు. రెండు రోజుల క్రితం బుధవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఈ కాంతి రేఖ ఆకాశంలో అగుపించింది. అది మెరుపులా లేదు. అలాగే ఒక్కసారిగా మెరిసి మాయం కాకుండా కాసేపు తచ్చాడింది. కాలిఫోర్నియాలోని అఖాత ప్రాంతంలో సాక్రామెంటో మీదుగా ఈ రహస్య కాంతిపుంజం ప్రత్యక్షమైంది. ఇప్పటివరకు ఈ తరహా మెరుపును ఎవ్వరూ చూడలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు రెండు రోజులుగా నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఈ మెరుపు ఏమైవుంటుందా అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతోపాటు ఇతర శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. చాలా మంది కాలిఫోర్నియా ప్రజలు ఈ కాంతిపుంజాన్ని తిలకించారు. దాన్నొక అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. నేవాడ, ఒరెగాం మీదుగా ఉత్తర కాలిఫోర్నియాలో కూడా ఈ మెరుపు కన్పించిందని ప్రజలు చెపుతున్నారు. అలాగే ఎక్కువ నీలికాంతులతో టెక్సాస్‌లోనూ కన్పించిందని అక్కడి ప్రజలు కొన్ని ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే కొన్ని వారాల క్రితమే టెక్సాస్‌లో ఇలాంటి కాంతిపుంజమొకటి కన్పించిందని వారంటున్నారు. ఇదొక ఏలియన్ పయనించిన మార్గమా అన్న అనుమానం కూడా తలెత్తింది. ఇదొక యుఎఫ్‌ఓ దృగ్విషయంగా ఎలిజిబెత్ మాటూజాక్ అనే శాస్త్రవేత్త అభివర్ణించారు. యుఎఫ్‌ఓ అంటే అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని అర్థం. అంటే గుర్తుతెలియని ఎగిరే పదార్థమన్నమాట! బహుశా యుఎఫ్‌ఓ ప్రయాణించిన మార్గం ఆ విధంగా రాకెట్ వెళ్లిన మార్గంలా కాంతి కన్పించివుండవచ్చని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అదే నిజమైతే అదొక ఏలియన్ ప్రయాణంగానే పరిగణించవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అమెరికన్ మెటాయిర్ సొసైటీ గురువారం ఉదయం తన ట్విటర్ ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేయగా, దానికి స్పందనగా 120కి పైగా రిపోర్ట్‌లు, 45కిపైగా ఫోటోలను పోస్ట్ చేశారు. ఇవి మూడు రాష్ట్రాల నుంచి అందాయి. ఇది కచ్చితంగా యుఎఫ్‌ఓ దృగ్విషయమే అయివుంటుందని ఎబిసి7న్యూస్ కథనం పేర్కొంది. ఫిబ్రవరి 24వ తేదీన కూడా సరిగ్గా ఇలాంటి కాంతిపుంజమే కన్పించింది. వాతావరణంలో మార్పుల కారణంగా ఇలాంటి మెరుపులు వస్తున్నాయా లేదా ఇదొక ఏలియన్ మార్గమా అన్నది అంతుచిక్కడం లేదు. ఏదేమైనప్పటికీ, దీనిపై నాసా శాస్త్రవేత్తలతోపాటు ఇతర ఖగోళ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు.